అజర్‌బైజాన్‌లో హంగామా

మాస్, యాక్షన్, ఎమోషన్ అంశాల మేళవింపుతో వెండితెరపై పతాకస్థాయిలో భావోద్వేగాల్ని పండిస్తారు దర్శకుడు బోయపాటి శ్రీను. కథానాయకుల పాత్రల్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో రామచరణ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ కథానాయిక. ప్రస్తుతం అజర్‌బైజాన్ దేశంలో చిత్రీకరణ జరుగుతున్నది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేశాం. మంగళవారం నుంచి అజర్‌బైజాన్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాం. 25రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సహనిర్మాత: కల్యాణ్ డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.