అఫీషియల్: శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్స్ లో ఎన్టీఆర్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఆరు రోజులు షూటింగ్ లో పాల్గొన్న విద్యా తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన శ్రీదేవితో కలిసి ఎన్నో హిట్స్ అందించాడు. ఈ క్రమంలో ఆమె పాత్రని కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో చేర్చాలని మేకర్స్ భావించారు. ఇందుకోసం బాలీవుడ్ నటులు కంగనా రనౌత్ , సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్ లని సంప్రదించారని ప్రచారం జరిగింది. కాని చిత్ర నిర్మాతలలో ఒకరైన విష్ణు ఇందూరి ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ శ్రీదేవి పాత్ర కోసం మేం మొదట సంప్రదించింది రకుల్ ప్రీత్ సింగ్ నే.మిగతా ఎవరితో చర్చలు జరపలేదు అని అన్నారు. ప్రస్తుతం అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ తీసుకునే పనిలో ఉన్నట్టు విష్ణు స్పష్టం చేశారు. శ్రీదేవికి వీరాభిమాని అయిన రకుల్ కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బయోపిక్ త్వరలో రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. రానా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించనున్నారు. 1949 జూలై 5న ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఓ గొప్ప చరిత్రకు శ్రీకారం జరిగిన ఆ పవిత్రమైన రోజున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంబించారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
× RELATED టాక్సీవాలా రివ్యూ