మూడువేల మంది నిపుణుల శ్రమ

సమాజానికి ఉపయుక్తమైన సందేశంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పే చిత్రమిది అని అన్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్‌కరణ్ నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకుడు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమీజాక్సన్ కథానాయిక. ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో ఈ సినిమాను విడుదలచేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే దాదాపు ఆరు వందల కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర మేకింగ్ వీడియో, త్రీడీ ట్రైలర్‌ను ప్రదర్శించారు.

రజనీకాంత్ మాట్లాడుతూ శంకర్ వల్లే ఈ సినిమా రాగలిగింది. సినిమాల పట్ల ఉన్న తపనతో భారీ బడ్జెట్‌తో సుభాష్‌కరణ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. వేలాది మంది సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అందరితో పాటు నేను ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు. శంకర్ మాట్లాడుతూ రజనీకాంత్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ హంగులతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం 3000 మంది వి.ఎఫ్.ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమాతో రెహమాన్, రసూల్ పూకుట్టి 4డీ సౌండింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో త్రీడీలో ఈ సినిమా రూపొందించాం. గొప్ప సినిమాను మనం కూడా చేయగలమని నిరూపించే చిత్రమిది అని చెప్పారు. ఎనిమిది సినిమాలకు పనిచేసినంత అనుభవం ఈ చిత్రానితో కలిగిందని, రీరికార్డింగ్ కోసం చాలా శ్రమించామని సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ చెప్పారు.