ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చర్యలు..

హైదరాబాద్‌: ప్రతీ ప్రభుత్వ అధికారి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాల్లో ఎన్నికల సన్నద్దత, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రజత్ కుమార్ మాట్లాడుతూ..కులాలు, మతాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు అడిగితే ఎన్నికల నియమావళి ఉల్లంఘన, సుప్రీంకోర్టు ధిక్కారంతో పాటు ఎన్నికల సంఘం పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇటువలంటి సందర్భాల్లో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైల్వే కేసుల ఉపసంహరణ వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. అభ్యర్థులు రూ.10వేలకు మించి నగదు చెల్లింపులు చేయరాదని రజత్ కుమార్ సూచించారు.

అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులతో పాటు వీడియో బృందాలు, సర్వైలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు ఉంటాయన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 53 మంది వ్యయ పరిశీలకులు వచ్చారని వెల్లడించారు. సీ- విజిల్‌ యాప్‌ వినియోగం బాగా పెరిగిందని, ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 2614 ఫిర్యాదులు వచ్చినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Related Stories: