కొత్తగా 18 లక్షల ఓట్లు

-జోరుగా కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ -4.90 లక్షల డూప్లికేట్,మృతిచెందిన 1.50 లక్షల ఓటర్ల ఇండ్లకు నోటీసులు -23 జిల్లాలకు ఈవీఎంలు పంపిణీ.. రేపటికల్లా అన్ని జిల్లాలకు -ఈవీఎంలు, వీవీప్యాట్లపై అన్ని గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు -రాజకీయ పార్టీలు ఓటర్ల నమోదులో పాల్గొనాలి -రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఓటర్ల నమోదుకు పెద్దఎత్తున స్పందన వస్తున్నదని, 18 ఏండ్లు నిండినవారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 18 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. 23 జిల్లాలకు ఈవీఎంలు చేరాయని, రెండు రోజుల్లో మిగతా జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై అన్ని గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను తొలిగించారని ఫిర్యాదు చేసే బదులు, నిజమైన ఓటర్లను నమోదు చేయించాలని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బూత్‌లెవల్ ఇంటింటి సర్వేలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియతోపాటు అడ్రస్ మార్పు, నకిలీ ఓటర్లు, మృతిచెందిన ఓటర్ల గుర్తింపు చేపట్టామన్నారు. డీఆర్వో నెట్ సాఫ్ట్‌వేర్ సాయంతో డూప్లికేషన్ ఓటర్ల తొలిగింపు చేపడుతున్నామన్నారు. ఒకే ఫొటో, వేర్వేరు చిరునామాలు, ఒకే తండ్రి పేరు ఉన్న 4.90 లక్షల డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. 1.50 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్టు గుర్తించామని, వారి అడ్రస్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు.

రెండు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈవీఎంలు

రాష్ట్రంలో 52,100 బ్యాలెట్ యూనిట్లు అవసరం ఉండగా ఇప్పటివరకు 39,470 యూనిట్లు వచ్చాయని రజత్‌కుమార్ తెలిపారు. 44 వేల వీవీప్యాట్లకుగానూ 18,700 వచ్చాయన్నారు. 40,700 కంట్రోల్ యూనిట్స్ అవసరం ఉండగా 30,840 వచ్చినట్టు చెప్పారు. కొన్ని యంత్రాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తాయని, వాటిని సరిచేస్తున్నామని వివరించారు. ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 12,751 గ్రామ పంచాయతీల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 19,044 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 32,574 పోలింగ్ బూత్‌లకు బూత్‌లెవల్ ఆఫీసర్ల నియామకం పూర్తి చేశామన్నారు. మాస్టర్ ట్రైనింగ్ క్యాంపెయినింగ్ కోసం 120 మంది అధికారులకు ఢిల్లీలో శిక్షణ ఇస్తామని చెప్పారు.

ఫిర్యాదు బదులు నమోదు చేయించండి

ఓటర్ల జాబితా నుంచి 70 లక్షల ఓట్లు తొలిగించారని రాజకీయపార్టీల నేతలు ఫిర్యాదు చేసే బదులు ఓటరు నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని, నిజమైన ఓటర్లను నమోదు చేయించాలని రజత్‌కుమాత్ విజ్ఞప్తిచేశారు. ఓటర్ల తొలిగింపు నిజమే అయితే.. వారు నిజమైన ఓటర్లే అయితే మళ్లీ వారిని ఓటరు జాబితాలో చేర్చితే సరిపోతుందన్నారు.

ఈవీఎం గోదాము సందర్శన

శామీర్‌పేట: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల గోదామును రజత్‌కుమార్ తనిఖీ చేశారు. గోదాము భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫస్ట్ లెవల్ చెకప్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం తూంకుంట మున్సిపాలిటీలోని సింగాయిపల్లి పోలింగ్‌బూత్‌ను సందర్శించారు. ఓటరు నమో దు వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, జేసీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు లచ్చిరెaడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.

ధ్రువపత్రాలు లేని ఓట్లనే తొలిగించాం!

-కారణాలను సీఈసీకి నివేదించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధ్రువపత్రాలు లేని కారణంగానే ఓట్లను తొలిగించామని రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఓట్ల తొలిగింపునకు గల కారణాలను వివరించినట్టు తెలిసింది. ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపట్టి, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నది. ఓటర్లు ఆయా చిరునామాల్లో లేకపోవడం, విచారణలో వారు అక్కడ ఉండటం లేదని ధ్రువీకరణ అయిన తర్వాత జాబితా నుంచి తొలిగించారు . ఇలా ఎన్నికల సంఘం రెండేండ్లపాటు సవరణ కార్యక్రమం నిర్వహించింది. 2015లో అర్బన్ ప్రాంతాలున్న 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2016లో గ్రామీణ ప్రాంతాలున్న 83 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ చేపట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రెండేండ్ల జాబితాను ఒకేసారి ప్రకటించడంతో భారీగా ఓటర్లను తొలిగించినట్టు కనిపించిందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఈ వివరాలను సీఈసీకి పంపించారు. తొలిగించిన ఓట్ల జాబితాలో పట్టణ ప్రాంతాల్లోని పేర్లే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. మరోవైపు తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో కలిశాయి. ఇందులో డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారు.. ఇలాంటివన్నీ తొలిగించడం వల్ల ఓటర్ల సంఖ్య తగ్గిందని నివేదించినట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంవరకు రెండు రాష్ర్టాలకు కలిపి ఒకటే ఎన్నికల కమిషన్ ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హయాంలోనే డూప్లికేట్, బోగస్ ఓటర్ల ప్రక్రియ చేపట్టారని, సరైన ధ్రువపత్రాలు లేనివాటిని తొలిగించారని తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు కేంద్రానికి నివేదించినట్టు తెలిసింది.

Related Stories: