ఎన్నికలకు మేం సిద్ధం

-సీఈసీకి రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదిక -అన్నీ సజావుగానే ఉన్నాయని వెల్లడి -నేడు రాష్ర్టానికి ఈసీ ఉన్నతస్థాయి బృందం -తొమ్మిది రాజకీయ పార్టీలతో భేటీలు -ప్రతి పార్టీతో పది నిమిషాలు సమావేశం -షెడ్యూలు ఖరారుచేసిన అధికారులు -రేపు సీఎస్, డీజీపీలతో భేటీ -ముసాయిదా ఓటరు జాబితా విడుదల -25వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ -అక్టోబర్ 10న ఓటర్ల తుది జాబితా ముద్రణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్నీ సజావుగానే ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. సోమవారం ఢిల్లీకి వెళ్లిన రజత్‌కుమార్.. రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయిన దగ్గర నుంచి తీసుకున్న చర్యలపై సీఈసీకి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 32,573 పోలింగ్ స్టేషన్లు, దాదాపు 3.50 లక్షలమంది సిబ్బంది అవసరమవుతారని చెప్పామన్నారు. అలాగే 44 వేల ఈవీఎంలు (వీవీప్యాట్లతో కలిపి), 40,700 కంట్రోల్ యూనిట్లు, 52 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని వివరించినట్టు తెలిపారు. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కు ఐదుగురు సిబ్బంది అవసరమవుతారని అంచనావేసి అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాల్సి ఉన్నదని అన్నారు. ఎన్నికల నిర్వహణకు రూ.308 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించామని చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలతోపాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే చకచకా పనులు పూర్తిచేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ మేరకు సమగ్ర నివేదికను సీఈసీకి రజత్‌కుమార్ అందించారు.

ఈ నివేదికతోపాటు రాష్ర్టానికి పంపనున్న ఉన్నతాధికారుల బృందం అందించే నివేదికలను పరిశీలించి.. కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానుంది. రెండ్రోజులపాటు ఇక్కడే ఉండే బృందం.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తుంది. ఈ రెండ్రోజుల్లో వివిధ రాజకీయ పార్టీలతోపాటు.. సీఎస్, డీజీపీ, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవుతుంది.

మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా తొమ్మిది రాజకీయపార్టీలతో సమావేశమయ్యేందుకు షెడ్యూలు ఖరారైంది. ప్రతి పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులకు అవకాశం ఇచ్చారు.

వారితో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం పది నిమిషాల చొప్పున సమావేశాలు జరుపుతుంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అవుతారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఉంటుంది.

అదేరోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశాల అనంతరం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తుంది.

ముసాయిదా ఓటరు జాబితా విడుదల

రాష్ట్రంలో 2018-19 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదయిన 2,61,36,776 మందితో ఓటర్ల సవరణ రెండో ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జాబితాలోని ఓటర్ల వివరాలను ప్రకటించింది. 2018 మొదటి ముసాయిదా జాబితాలో 2,53,27,785 మంది ఓటర్లు నమోదు కాగా, కొత్తగా మరో 9,45,955 మంది అదనంగా చేరారు. వివిధ కారణాలరీత్యా తొలిగించిన ఓటర్ల సంఖ్య 1,36,964. రెండో సవరణ జాబితాలో 2,61,36,776 మంది ఓటర్లుగా నమోదుకాగా.. ఇందులో 18-19 ఏండ్లకు పైబడిన పురుష ఓటర్లు 1,31,33,297. 18-19 ఏండ్లకు పైబడిన మహిళలు 1,27,80,399. 18-19 ఏండ్లకు పైబడిన థర్డ్ జండర్లు 2,406 మంది ఉన్నారు. 18-19 ఏండ్లున్న యువ పురుష ఓటర్లు 1,34,329 కాగా, 18-19 ఏండ్లున్న యువ మహిళా ఓటర్లు 86,313. అలాగే 18-19 ఏండ్లున్న థర్డ్ జండర్ ఓటర్లు 32 మంది జాబితాలో చోటుచేసుకున్నారు.