చర్చ పెట్టండి.. సవాల్ విసరండి

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ):సామాజిక పింఛన్లపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రజల్లో చర్చపెట్టి.. వాస్తవాలను వివరించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనే పింఛన్ల విషయంలో అవాస్తవాలను బీజేపీ ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందనీ, తిరిగి మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పంథాను ఎంచుకుంటుందనీ, ఇక ముందైనా వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ శ్రేణులపై ఉందన్నారు. గురువారం కరీంనగర్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. నిజానికి పింఛన్ల విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పింఛన్ల అంశాన్ని బీజేపీ ప్రధాన ఎజెండా చేసుకొని ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టించిందని తెలిపారు. ఈ సమయంలో వాస్తవాలను ప్రజల ముందుంచడంలో టీఆర్‌ఎస్ పార్టీ తరపున సరైన పాత్ర పోషించలేకపోయామన్న విషయాన్ని వినోద్‌కుమార్ వివరించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి పింఛన్‌లో ఆరేడు వందలను కేంద్రం ఇస్తున్నట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇందులో ఏది వాస్తవం.. ఏది అవాస్తవమో ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. నిజానికి కేంద్రం అన్ని రకాల పింఛన్లు కలిపి రాష్ట్రంలో 6,66,523 మందికి కేవలం నెలకు 200ల చొప్పున మాత్రమే ఇస్తుందన్నారు. ఇందుకోసం ఏటా 203 కోట్లను కేంద్రం వెచ్చిస్తుందని తెలిపారు. ఈ వాస్తవాలను బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పడం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. పింఛన్లు ఇస్తున్నామనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ ఇచ్చిన వెయ్యి పింఛన్‌లో కేంద్రం నుంచి ఆరు ఏడు వందలు కేంద్రం నుంచి వస్తున్నాయని చెపుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. కేవలం 200 మాత్రమే ఇస్తున్న విషయాన్ని వివరించడం లేదన్నారు. ఇచ్చే 200లకు సవాలక్ష నిబంధనలున్నాయని పేర్కొన్నారు. కానీ, సీఎం కేసీఆర్.. మాత్రం 2018-2019 సంవత్సరంలో రాష్ట్రంలో 39,42,731 మందికి పింఛన్లు ఇచ్చారని పార్టీ శ్రేణులకు గణాంకాలతో సహా వివరించారు. ఇందులో వికలాంగులకు నెలకు 1500లు, మిగిలిన అన్ని వర్గాల వారికి నెలకు 1000 చొప్పున ఏడాదికి 5,056 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పింఛన్లు పెంచి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారనీ, ఆ మేరకు అన్ని పింఛన్లు పెంచిన విషయాన్ని తెలిపారు. వికలాంగులకు గతంలో నెలకు 1500లు ఇస్తే ఇక ముందు 3016 ఇవ్వనున్నారనీ, వృద్ధులు, వితంతువుల వంటి ఇతర వర్గాలకు గతంలో నెలకు రూ.వెయ్యి ఇస్తే ప్రస్తుతం 2016 ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జూన్ నుంచి పెంచిన పింఛన్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయాన్ని పార్టీ నాయకులకు వివరించారు. అంతేకాదు ఎక్కువ మందికి లబ్ధి కల్పించాలన్న ఉద్దేశంతో వయో పరిమితిని 57 ఏండ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించందన్నారు. దీని వల్ల 2019-20లో రాష్ట్రంలో 47,88,070 మందికి పింఛన్లు అందుతాయన్నారు. దీని ద్వారా ఇక నుంచి ఏటా 11,843 కోట్లను ప్రభుత్వం పింఛన్ల రూపంలో ప్రజలకు అందించనుందని తెలిపారు. బడ్జెట్ ఎంత పెరిగినా దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి భారంగా భావించడం లేదన్నారు. ప్రజలకు ఆసరాగా నిలువాలన్న లక్ష్యంతో మాననీయ కోణంలో అమలు చేస్తున్న గొప్ప పథకం ఇదనీ, ఈ విషయాన్ని గణాంకాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చ పెట్టండి.. సవాలు విసరండి.. వాస్తవాలను అంకెలతో సహా ప్రజలకు వివరించండి.. అంటూ సూచించారు. వాస్తవాలను వక్రీకరణ చేస్తున్న బీజేపీ వ్యహారాన్ని బట్టబయలు చేసేందుకే గణాంకాలతో సహా పార్టీ శ్రేణులకు వివరిస్తున్నట్లు తెలిపారు. వినోద్‌కుమార్ గణాంకాలతో సహా వివరించిన తీరుపై పార్టీ శ్రేణులు అనందం వ్యక్తంచేశారు. ఆసరా పింఛన్ల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
More