చకచకా ఏర్పాట్లు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో స్ట్రాంగ్ రూంలు, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటిల్లో అవసరమైన పనులు చేపడుతున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అస్టిసెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించారు. జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు కొత్తపల్లి, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. వీటితోపాటు ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి గదులను ఏర్పాటు చేసే విషయంలోనూ అధికారులు దృష్టి పెడుతున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా మూడు డివిజన్లకు ఒక్క రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను 20 మందిని నియమించారు. వీరికి ఆయా డివిజన్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల అధికారులకు శిక్షణ మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ఆయా డివిజన్లు, వార్డులకు నియమించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో జడ్పీ సీఈవో వెంకటమాధవరావు ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించారు. ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, తదితర అంశాలను పూర్తిస్థాయిలో వివరించారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన పద్ధతులు, నియమ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై క్షుణ్నంగా వివరాలను అందించారు. నామినేషన్ల పక్రియ మొదలు కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు రిటర్నింగ్ అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ భద్రయ్య, శిక్షణ నిర్వాహకులు రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్వోలు, ఏఆర్వోల నియామకం.. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు డివిజన్ల వారీగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా మూడు డివిజన్లకు ఒకరి చొప్పున ఆర్వో, ఏఆర్వోలను 20మందిని నియమించారు. వీరితోపాటు నలుగురు రిజర్వ్‌లో ఉండే విధంగా చూశారు. రిజర్వ్ ఆర్వోలుగా జీ కుమారస్వామి, కే స్వామిదాస్, పీ హరీశ్, జీ రాజేంద్రనాథ్, ఏఆర్వోలుగా యుగేందర్‌రాజు, నర్సింహారెడ్డి, పీ అంజయ్య, బానోతు కిషన్‌ను నియమించారు. వారి వివరాలను వెల్లడించారు.
More