నెలజీతం పాఠశాలకే..

-బొప్పాపూర్ ఎంపీటీసీ గీతాంజలి ప్రకటన -విద్యార్థుల టై, బెల్టుల ఖర్చును సైతం భరిస్తామని హామీ -హర్షం వ్యక్తంచేసిన తల్లిదండ్రులు.. ఘన సన్మానం ఎల్లారెడ్డిపేట: ఎంపీటీసీగా తనకు ప్రభుత్వం ఇచ్చే నెలజీతం రూ.5వేలు పాఠశాలకే అందజేస్తానని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి వెల్లడించి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల సమావేశాన్ని బుధవారం నిర్వహిం చగా, ఎంపీటీసీ గీతాంజలి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో ఓ అదనపు ఉపాధ్యాయుడి అవసరం ఏర్పడిందని అందుకు తనవంతు సాయంగా ఆ టీచర్‌కు అయ్యే వేతనాన్ని తన జీతంతో చెల్లిస్తానని ముందుకువచ్చారు. అదీగాక దీంతోపాటు విద్యార్థులకు టై, బెల్టులకు అయ్యే ఖర్చుసైతం తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో గ్రా మస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దంపతులు ఇల్లెందుల గీతాంజలి-శ్రీనివాస్‌రెడ్డిని సర్పంచ్ కొండాపురం బాల్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
More