గొర్రెల కొనుగోల్‌మాల్

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నింపాలనే ల క్ష్యంతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జిల్లా అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కలెక్టర్ అనుమతి లేకుండా సుమారు 600 యూనిట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నమ్మని కలెక్టర్ క్షేత్ర స్థా యిలో విచారణ జరిపించగా 85 శాతం గొర్రెలు లేనట్లుగా నిర్ధారించుకున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇచ్చిన ఆయన నివేదిక మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్ పీ రాజన్నపై బదిలీ వేటు పడింది. ఇక్కడే పనిచేస్తున్న అసిస్టెం ట్ డైరెక్టర్ డాక్టర్ వీ అశోక్‌కుమార్‌కు జిల్లా పశుసంవర్ధక అధికారిగా పూర్తి బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ లేకుండానే... జిల్లాలోని గొర్రెల పెంపకందారుల సహకార సం ఘాల ద్వారా గొల్ల, కుర్మలకు పంపిణీకి మొదటి విడత 13,519, రెండో విడతలో 13,420 యూ నిట్లు మంజూరు చేశారు. ఒక్కో యూనిట్‌లో 20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు ఉండేలా రూపకల్పన చేశారు. ఈ యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా, లబ్ధిదారుల వాటా రూ.31,250. అయితే మొదటి విడత గొర్రెల కొనుగోలులోనే జిల్లా అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి గొర్రెలు కొనుగోలు చేశారు. డిమాండ్ మేరకు అక్కడ దొరక్క పోవడంతో మ హారాష్ట్రలోని వార్ధా ప్రాంతం నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ ప్రాంతం నుంచి సుమారు 600 యూనిట్ల గొర్రెలను గత ఫిబ్రవరి నెలలో అధికారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ప్రభుత్వ ఖాతాలోగానీ, కలెక్టర్ ఖాతాలోగాని నిధులు లేవని సమాచారం. దీనిని ఏ విధంగానూ లెక్కలోకి తీసుకోని పశుసంవర్ధక శాఖ అధికారులు బిల్లులు చెల్లించకుండానే వార్ధా ప్రాంతానికి చెందిన అమ్మకందారుల నుంచి వాటా చెల్లించిన లబ్ధిదారులు సుమారు 600 మందికి గొర్రెలు కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. యూనిట్ విలువ రూ.1.25 లక్షలు అయినా ట్రాన్స్‌పోర్ట్ ఇతరత్రా ఖర్చులు పోను అమ్మకందారులకు ఒక్కో యూనిట్‌పై రూ.1.11 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ. 6.60 లక్షల బిల్లులు చెల్లించాలని గత ఫిబ్రవరిలోనే పశుసంవర్ధక శాఖ అధికారులు నోట్‌ఫైల్ పెట్టారు. కొనుగోలు చేసే ముందు తన అనుమతి తీసుకోలేదనీ, బడ్జెట్ లేని సమయంలో ఏ విధంగా కొనుగోలు చేస్తారని కలెక్టర్ బిల్లుల చెల్లింపునకు నిరాకరించారు. బిల్లులు చెల్లించేది లేదని సదరు నోట్‌ఫైల్‌ను తిరస్కరించడమే కాకుండా ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. విచారణలో వెలుగులోకి నిజాలు.. తన అనుమతి లేకుండా బడ్జెట్ లేని సమయంలో గొర్రెలు కొనుగోలు చేసినట్లు గుర్తించిన కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని గత ఫిబ్రవరిలోనే ఎంపీడీఓలను ఆదేశించారు. 9 మండలాల్లో పంపిణీ జరిగినట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు బిల్లుల కోసం ఇచ్చిన లబ్ధిదారుల పేర్ల ఆధారంగా ఆయా మండలాల ఎంపీడీఓలు ఇంటింటికీ వెళ్లి విచారణ జరిపారు. ఈ వి చారణలో 85 శాతానికిపైగా లబ్ధిదారుల ఇండ్లలో గొర్రెలు లేవని నిర్ధారించిన ఎంపీడీఓలు కలెక్టర్‌కు ఇటీవల నివేదిక ఇచ్చారు. దీంతో విస్తుపోయిన కలెక్టర్ వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గొర్రెల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనీ, వీటికి సంబంధించిన బిల్లులు చెల్లించలేనని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నిబ ంధనలకు విరుద్దంగా కలెక్టర్ అనుమతి లేకుండా గొర్రెలు కొనుగోలు చేసిన పశుసంవర్ధక అధికారులు బిల్లుల చెల్లింపునకు సమర్పించిన నోట్‌ఫైల్‌ను తిరస్కరించిన కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల నుంచి వారి వాటాగా డీడీలు వచ్చిన తర్వాత కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెట్టి అనుమతి తీసుకున్న తర్వాతనే గొర్రెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లా అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరించడంతో కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించగా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది లబ్ధిదారులు తమ గొర్రెలు వలస పంపామనీ, బంధువుల ఇండ్లలో ఉన్నాయని చెప్పినట్లు ఎంపీడీఓల విచారణలో తెలినట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జి అధికారిపై బదిలీ వేటు.. పెద్దపల్లి జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ పీ రాజన్న జిల్లాకు ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి అధికారిగా ఉన్న విక్రమ్‌కుమార్ విరమణ తర్వాత ఇన్‌చార్జిగా రాజన్నకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఫిబ్రవరి 28న ఇతని స్థానంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ వీ అశోక్‌కుమార్‌కు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఒక్క రోజుకూడా గడవక ముందే తిరిగి రాజన్న అదేస్థానానికి వచ్చారు. అప్పటి నుంచి జిల్లా ఇన్‌చార్జి పశుసంవర్ధక శాఖ అధికారిగా రాజన్న కొనసాగుతున్నా రు. రెండోసారి ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించినపుడే కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇతన్ని తిరస్కరించినట్లు తెలిసింది. అతను మొదటి సారి ఇన్‌చార్జిగా ఉన్న సమయంలోనే కలెక్టర్ అనుమతి లేకుండానే కొనుగోళ్లు జరిపినట్లు అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆరు నెలలుగా సాగిన విచారణ నివేదికలను కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించడంతో రాజన్నపై బదిలీ వేటు పడింది. పూర్తి బా ధ్యతలు నిర్వహిస్తున్న పెద్దపల్లి నుంచి కూడా బదిలీ చేసిన ప్రభుత్వం కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతని స్థానంలో కరీంనగర్ పశుసంవర్ధక అధికారిగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్‌కు, పెద్దపల్లి జిల్లాకు గోదావఖని అసిస్టెంట్ డైరెక్టర్ రామస్వామికి పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Related Stories: