రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన..

హైదరాబాద్ : వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 3 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది.. వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి 330 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు.

రానున్న 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉందన్నారు. వాయుగుండం పశ్చిమ ఉత్తర దిశగా కదులుతూ ఇవాళ అర్ధరాత్రికి కళింగపట్నం, పారాదీప్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ తరువాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండానికి అనుబంధంగా సముద్రమట్టానికి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున విస్తరించిన ద్రోణి.. నైరుతి దిశగా కదులుతున్నది.

Related Stories: