పెట్రో మంట.. మోదీ మౌనం

-విదేశాల్లో ఉపన్యాసాలు గుప్పించే ప్రధాని స్వదేశంలో నోరు విప్పరు.. -కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రా హుల్‌గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోల్ ధరలు మండిపోతుంటే.. ప్రధాని నోరెందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని విపక్ష కూటమి ఓడిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పెట్రో ధరలకు నిరసనగా సోమవారం చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇతర పా ర్టీలతో కలిసి కాంగ్రెస్ భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మోదీ పాలనపై ధ్వజమెత్తారు. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా మాట్లాడరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించరు. రాఫెల్ ఒప్పందంపై ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నా పెదవి విప్పరు. పెద్దనోట్ల రద్దుపై ఇప్పటికీ వివరణ ఇవ్వరు అని దుయ్యబట్టారు. 70ఏండ్లలో చేయని పనుల్ని తాముచేశామని మోదీ చెబుతున్నారు. నిజమే. మత, కుల, ప్రాంతాల మధ్య విద్వేష బీజాల్ని నాటారు. ఈ నాలుగేండ్లలో జరిగిన ఈ పని 70ఏండ్లలో ఎన్నడూ జరుగలేదన్నది వాస్తవం అని అన్నారు.

మోదీ ప్రభుత్వం అన్ని హద్దుల్నీ దాటేసింది

దేశప్రయోజనాలకు ఉపయోగపడని పనులు చేపట్టడంలో మోదీ ప్రభుత్వం అన్ని పరిమితుల్నీ దాటేసిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విమర్శించారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ వివిధ పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యమయ్యేందుకు ముం దుకు వస్తున్నాయన్నారు. ఈ ప్రదర్శనలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్‌యాదవ్, ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ సంజయ్‌సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాలొన్నారు.

గాంధీ సమాధివద్ద జలాభిషేకం

పెట్రో ధరలపై విపక్షాల ఐక్యనిరసన ప్రదర్శనతో సోమవారం ఢిల్లీలో ఉత్సాహంగా జరిగింది. కాంగ్రె స్ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు 21రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ర్యాలీకి ముందు.. రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధివద్ద రాహుల్ నివాళులర్పించారు. మానస సరోవరం నుంచి తెచ్చిన పవ్రితనీటితో మహాత్ముడి సమాధికి జలాభిషేకం చేశారు. అనంతరం రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రామ్‌లీలా మైదానం వరకు సాగింది.

Related Stories: