మీకు గాంధీ ఇంటి పేరుంది.. ఇంకేం కావాలి?

లండన్: గాంధీ ఇంటి పేరును వాడుకోవడంపై ఇప్పటికే రాహుల్‌గాంధీ, ఆయన కుటుంబం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ పేరుతోనే ఇంకా రాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్థులు కూడా తరచూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే వీటన్నింటికీ రాహుల్‌గాంధీ సమాధానమిచ్చారు. యూకేలో జర్నలిస్టులతో మాట్లాడిన సందర్భంగా ఓ వ్యక్తి కూడా రాహుల్‌ను ఇదే ప్రశ్న వేశారు. మీకు గాంధీ ఇంటి పేరుంది.. ఇంకేం కావాలి అని. దీనిపై రాహుల్ స్పందించారు. నన్ను నా సామర్థ్యం ప్రకారం అంచనా వేయండి కానీ.. గాంధీ ఇంటి పేరు చూసి కాదు అని ఆయన స్పష్టంచేశారు. గతేడాది అమెరికా పర్యటన సందర్భంగా కూడా రాహుల్ వారసత్వం రాజకీయాలపై స్పందించిన విషయం తెలిసిందే. అసలు ఇండియా మొత్తం వారసత్వ రాజకీయాలపైనే నడుస్తుందని అప్పట్లో ఆయన అనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఆయన నేరుగానే సమాధానమిచ్చారు. నేను వచ్చిన కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని విమర్శలు చేస్తారా లేక నా సామర్థ్యాన్ని చూసి అంచనా వేస్తారా అన్నది మీ ఇష్టం అని రాహుల్ అన్నారు.

మూడు తరాలుగా ప్రధాని పదవిని ఆ కుటుంబమే అనుభవించిందన్న విమర్శలపై స్పందిస్తూ.. తన తండ్రి రాజీవ్‌గాంధీ తర్వాత తన కుటుంబం ఇప్పటివరకు అధికారంలోకి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టంచేశారు. అవును నేను ఆ కుటుంబంలోనే జన్మించాను. అయితే ముందు నేను చెప్పేది వినండి.. వివిధ అంశాలపై నాతో మాట్లాడండి. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, భారత్ అభివృద్ది, వ్యవసాయంపై నాతో స్వేచ్ఛగా చర్చించండి. మీరు ఏమైనా ప్రశ్నలు అడగండి.. అప్పుడు నాపై ఓ అంచనాకు రండి అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఇందుకు సిద్ధంగా లేరని రాహుల్ విమర్శించారు. నిజానికి తనపై ప్రతి విషయంలోనూ దాడి చేసే ఆరెస్సెస్ వల్లే ఇంతలా రాటుదేలానని, ఒకరకంగా వాళ్లే తనకు సాయపడ్డారని ఆయన చెప్పడం విశేషం. తాను అందరి సూచనలు వింటానని, ప్రతి ఒక్కరి ఆలోచనలను స్వాగతిస్తానని చెప్పారు.

Related Stories: