తెలంగాణ క్యాడర్‌కు ముగ్గురు ఐపీఎస్‌లు

-రేపు ఐపీఎస్-2016 బ్యాచ్ పాసింగ్‌ఔట్ పరేడ్ - హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముగ్గురు యువ ఐపీఎస్ అధికారులను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. ఐపీఎస్-2016 బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న 122 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతరాజు సాయిచైతన్య, తెలంగాణకు చెందిన రాజేశ్‌చంద్ర, శరత్‌చంద్రపవార్ మన క్యాడర్‌కు వచ్చారు. తెలంగాణకు చెందిన వై రిషాంత్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన సతీశ్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన సుమిత్ సునీల్, పంజాబ్‌కు చెందిన వకుల్ జిందాల్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. ఐపీఎస్-2016 బ్యాచ్ ప్రొబేషనరీ అధికారుల పాసింగ్‌ఔట్ పరేడ్‌ను సోమవారం నిర్వహించనున్నట్టు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) డైరెక్టర్ డీఆర్ డోలేబర్మన్ తెలిపారు. వీరితోపాటు శిక్షణ పొందిన మరో 14 మంది విదేశీ అధికారులు సైతం పాసింగ్‌ఔట్ పరేడ్‌లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ పాసింగ్‌ఔట్ పరేడ్-2017 వివరాలను శనివారం ఎస్వీపీఎన్పీఏలో ఆమె మీడియాకు వెల్లడించారు. 2016 డిసెంబర్ 19న ప్రారంభమైన శిక్షణలో యువ ఐపీఎస్ అధికారులు వివిధఅంశాల్లో సుశిక్షితులయ్యారని, పాసింగ్‌ఔట్ పరేడ్ అనంతరం మరో 8 నెలలపాటు వారికి కేటాయించిన జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. 2018 సెప్టెంబర్‌తో వీరి శిక్షణ పూర్తవుతుందని చెప్పారు.

122 మందిలో 75 మంది ఇంజినీరింగ్ చదివినోళ్లే

ఐపీఎస్-2016 బ్యాచ్‌లో 122 మంది ఐపీఎస్ శిక్షణ పొందగా.. వీరిలో 75 మంది ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారే ఉండటం గమనార్హం. ముగ్గురు డాక్టర్లు, నలుగురు లా విద్యార్థులు, ముగ్గురు ఎంఫిల్ పూర్తిచేసిన వారు, సైన్స్ విద్యార్థులు ఆరుగురు, ఆర్ట్స్‌గ్రూపులకు చెందినవారు ఏడుగురు, ఒకరు ఎంబీఏ చేయగా, 21 మంది ఇతర కోర్సులు చేశారు. బ్యాచ్‌లో 21 మంది మహిళా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరితోపాటు శిక్షణ పూర్తిచేసుకున్న 14 మంది విదేశీ అధికారుల్లో ఐదుగురు భూటాన్ పోలీస్ నుంచి, ఐదుగురు నేపాల్ పోలీస్ నుంచి, నలుగురు మాల్దీవ్‌ల పోలీసు నుంచి ఉన్నారు.

Related Stories: