ద్రవిడ్ నాలో ధైర్యం నింపాడు- విహారి

అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం అంటే ఎవరైనా ఒత్తిడికి గురికావాల్సిందే. దేశవాళీలో సత్తాచాటి జాతీయజట్టులోకి వచ్చిన ఆంధ్ర కుర్రాడు హనుమ విహారికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. హార్దిక్ పాండ్యా స్థానంలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు తుదిజట్టులోకి వచ్చిన విహారి అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీతో సత్తాచాటాడు. జట్టులో స్థానం ఖరారైందని తెలిసిన తర్వాత తన ఆనందాన్ని కుటుంబసభ్యులతో కలిసి పంచుకున్న ఈ యువ క్రికెటర్ తన గురువు రాహుల్ ద్రవిడ్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు రోజు ద్రవిడ్‌కు ఫోన్ చేశాను. అతనితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాలో నెలకొన్న ఒత్తిడి దూరమైంది. అద్భుతమైన ఆటతీరు ఉంది, మైదానంలోకి దిగి ఆటను ఆస్వాదించమని ద్రవిడ్ సూచించాడు. అతనో క్రీడా దిగ్గజం, టెక్నిక్ పరంగా విలువైన సలహాలు, సూచనలు అందుకున్నాను. ద్రవిడ్ కోచ్‌గా భారత్ ఎ పర్యటనలో రాణించడం ద్వారానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని విహారి అన్నాడు. మరోవైపు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన తనకు కెప్టెన్ కోహ్లీ అండగా నిలిచాడని విహారీ చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ ద్వయం అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కొని పరుగులు సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు.