పోలింగ్ సరళిపై అభ్యర్థుల్లో గుబులు

- కాలనీల్లో పెరిగిన ఓటింగ్‌ శాతం - మైనార్టీలు, బస్తీవాసుల ఓట్లే నిర్ణయాత్మకం - మూడు డివిజన్ల ఓట్లతోనే ఫలితంపై ప్రభావం హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటింగ్ సరళి సాగిన తీరుపై తీవ్ర అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తున్నది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాలనీవాసులు, అపార్ట్‌మెంట్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువశాతం పోలింగ్ నమోదు కావడంతోపాటు బస్తీలు, మురికివాడల్లో ఓటింగ్ తగ్గడంతో ఎవరికి నష్టం అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా జూబ్లీహిల్స్ డివిజన్‌లో 26,971మంది ఓటేశారు. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలో 25,820మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో 25,558 ఓట్లు నమోదయ్యాయి. ఈ మూడు డివిజన్లే ఫలితాన్ని శాసించే అవకాశం ఉండడంతో ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడిఉంటాయనే లెక్కల్లో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. నియోజకవర్గంలో పోలయిన 1,41,283 ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మైనార్టీలు అధికంగా నివాసం ఉంటున్న ప్రాంతాలైన ఎంఎస్.మక్తా, బీఎస్ మక్తా, హిమాయత్‌నగర్‌లోని షేరీగేట్, బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఖాజా నగర్, బోళానగర్, శ్రీరాంనగర్, వేంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని సింగాడకుంట, సింగాడబస్తీ తదితర ప్రాంతాల్లో కలిపి సుమారు 43వేల ఓట్లు ఉన్నాయి. వీటిలో సుమారు 22వేల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడితే టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారుతుందని, ఒకవేళ బీజేపీకి 3వేల ఓట్లు ఈ ప్రాంతాల్లో పడితే ఆ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో పడే ఓట్లు ఖైరతాబాద్ నియోజకవర్గం ఫలితాన్ని శాసించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. బస్తీల ఓట్లే నిర్ణయాత్మకం.. నియోజకవర్గంలో మైనార్టీలతోపాటు బస్తీలు, మురికివాడల్లో నివాసం ఉంటున్న ఓటర్లు కీలకంగా మారారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ 18బస్తీల్లో పోలింగ్‌శాతం అధికంగా నమోదవడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఉత్సాహంగా ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీల్లోని 17పోలింగ్ బూత్‌లలో కలిపి 18,967 ఓట్లు ఉండగా 10,964 ఓట్లు పోలయ్యాయి. ఈ ప్రాంతంలో పోలింగ్‌శాతం 57.80గా తేలింది. ఈ ప్రాంతంలోని ఓట్లను టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్‌పీ కూడా కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో ఏ పార్టీకి మంచి మెజార్టీ వస్తే వారికి నియోజకవర్గంలో కలిసి వస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్, జవహర్‌నగర్, సాగర్‌సొసైటీ ప్రాంతాల్లోని 8పోలింగ్ బూత్‌లతో సుమారు 100089 ఓట్లకు గాను 5223 మంది ఓటువేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్‌బీటీనగర్ పరిసర ప్రాంతాల్లోని 10పోలింగ్ బూత్‌లలో ఉన్న సుమారు 11,753 ఓటర్లకు గాను 6115 మంది ఓటేశారు. ఈ ఓట్లలో మెజార్టీ ఎవరికి వస్తుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాలనీల్లో ఎవరికి లాభమో..? నియోజకవర్గంలో గతంలో కాలనీలు, అపార్ట్‌మెంట్స్‌లో తక్కువశాతం పోలింగ్ నమోదయ్యేది. అయితే ఈ సారి కాలనీలకు చెందిన బూత్‌లతో పోలింగ్‌శాతం బాగా పెరిగింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలోని ఆనంద్‌నగర్ కాలనీ, వెంకటరమణకాలనీ, నవీన్‌నగర్, పద్మావతికాలనీ తదితర ప్రాంతాల్లోని 6బూత్‌లతో 7438 ఓటర్లు ఉండగా వారిలో 4225 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రాంతాల్లో పోలింగ్‌శాతం 56.80గా నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారు అనేది కీలకంగా ఉంది. సోమాజిగూడ డివిజన్‌లోని కుందన్‌బాగ్, జూబ్లీహిల్స్ సొసైటీ, ఫిలింనగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో పోలింగ్ శాతం పెరగడంతో అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు.

Related Stories: