బ్యాంకుల వైఫల్యం వల్లే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)కు కారణం బ్యాంకుల వైఫల్యమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఎన్‌పీఏల అంశంపై వివరణ కోరిన మురళీ మనోహర్ జోషి నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి ఈ మేరకు రాజన్ బదులిచ్చారు. రుణాలు.. నిరర్థక ఆస్తులుగా మారకుండా ఉండటానికి బ్యాంకులు అప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటున్న బకాయిలకూ అదనపు నిధులు మంజూరు చేస్తూ పోయాయని చెప్పుకొచ్చారు.

నెమ్మదించిన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు కూడా ఎన్‌పీఏల పెరుగుదలకు ఓ కారణమేనన్న ఆయన 2008 ఆర్థిక మాంద్యం తర్వాత బ్యాంకుల వృద్ధి అంచనాలు తలకిందులయ్యాయని చెప్పారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పనిచేశారు. ఇదిలావుంటే ఇప్పటికే ఈ అంశంపై కమిటీ ఎదుట మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రమణియన్, ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అధియా, ఇతరత్రా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెంది సీనియర్ అధికారులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు హాజరైన విషయం తెలిసిందే. ప్రభుత్వ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు రూ.7.77 లక్షల కోట్లుగా ఉన్న సంగతి విదితమే.

Related Stories: