అభిమాని రిస్కీ ఫీట్ వీడియోపై స్పందించిన లారెన్స్

చెన్నై: అభిమానం ఉంటే హద్దుల్లో ఉండాలి కానీ..అది ప్రాణాల మీదకు వచ్చేలా ఉండకూడదు. సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ అభిమాని ప్రమాదకర ఫీట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. లారెన్స్ స్వీయదర్శకత్వంలో వచ్చిన కాంచన ౩ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే లారెన్స్ వీరాభిమాని ఒకరు ఓ థియేటర్ వద్ద ఆయన కటౌట్‌ ఏర్పాటు చేశారు. దశావతారంలో కమల్‌ హాసన్‌ లా క్రేన్‌ కు వేలాడుతూ..లారెన్స్ భారీ కటౌట్‌ కు పూలమాల వేసి పాలాభిషేకం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో..అభిమాని ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు లారెన్స్. నా అభిమానులు, స్నేహితులకు విజ్ఞప్తి. ఓ అభిమాని క్రేన్‌ కు వేలాడుతూ నా కటౌట్‌ కు పాలాభిషేకం చేయడం చూశా. వీడియో చూశాక చాలా బాధనిపించింది. ప్రాణాలను రిస్క్‌ లో పెట్టి ఇలాంటి పనులు చేయొద్దు. నాపై అంత అభిమానం ఉంటే ఆపదలో ఉన్నవారికి మీ వంతు సాయం చేయండి. అలా చేస్తే నాకు సంతోషం. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకూడదని అభిమానులను కోరుతున్నానని విజ్ఞప్తి చేశాడు రాఘవా లారెన్స్.
More in సినిమా :