తజికిస్థాన్ జైలులో హింస: 32 మంది మృతి

-మృతుల్లో 24 మంది ఇస్లామిక్ స్టేట్ జిహదీ సభ్యులు -పారిపోయేందుకు ఉగ్రవాదుల ప్రయత్నించడంతో ఘర్షణ
దుశాంబే (తజికిస్థాన్), మే 20: తజికిస్థాన్ జైలులో చెలరేగిన హింసలో 32 మంది మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు గార్డులతోపాటు 24 మంది ఇస్లామిక్ స్టేట్ జిహదీ సభ్యులు ఉన్నారు. తొలుత ఆదివారం సాయంత్రం జైలు సెక్యూరిటీ గార్డులు, కొందరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు కలిగివున్న కొందరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గార్డులపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురు ఖైదీలతోపాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడే ఉన్న దవాఖానలోని పలువురు ఖైదీలను బందీలుగా చేసుకొని పారిపోయేందుకు యత్నించారు. ఈ దశలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి బందీలను విడిపించేందుకు సెక్యూరిటీ గార్డులు రంగప్రవేశం చేశారు. సుమారు అర్ధగంట పాటు ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. 35 మందిని సెక్యూరిటీ గార్డులు అదుపులోకి తీసుకొన్నారు. తజికిస్థాన్‌లో నిషేధానికి గురైన ఇస్లామిక్ పునరుజ్జీవ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులను అల్లర్లకు దిగినవారు హత్యచేసినట్టు అధికారులు గుర్తించారు. సిరియాలో ఐఎస్ గ్రూప్‌లో చేరేందుకు ప్రయత్నించి అరస్టై పదేండ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బెఖ్రుజ్ గుల్మురోడ్ ఈ హింసలో పాత్ర ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. బందీలను ఉగ్రవాదుల నుంచి విడిపించామని, పరిస్థితి అదుపులో ఉన్నదని ఆ దేశ న్యాయశాఖ మంత్రి ప్రకటించారు.