రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్

Prajnesh-gunneswaran నార్త్ కరోలినా: భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ-250 టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌కు చేరాడు. అమెరికా వేదికగా జరుగుతున్న విన్‌స్టన్ సాలెమ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6-3, 6-4తో సెడ్రిక్ మార్సెల్ స్టెబ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రజ్నేశ్ వరుస సెట్లలో గెలుపొందాడు. ఐదింట రెండు బ్రేక్ పాయింట్లు కాపాడుకున్న గుణేశ్వరన్ ఒక డబుల్ ఫాల్ట్ చేస్తే.. ప్రత్యర్థి 7 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్, టాప్ సీడ్ బెనాయిట్ పెయిర్ (ఫ్రాన్స్)తో ప్రజ్నేశ్ మంగళవారం అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో దివిజ్ శరణ్-రోహన్ బోపన్న జోడీ తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దివిజ్-బోపన్న జంట తొలిరౌండ్‌లో 3-6, 3-6తో వరుస సెట్లలో నికోలస్ మొన్రో-సాండ్‌గ్రెన్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది.