కొత్త చిత్రానికి శ్రీకారం

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న త్రిభాషా చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కేకే రాధాకృష్ణ (జిల్‌ఫేమ్) దర్శకుడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పకుడు. పూజా హేగ్డే కథానాయికగా నటించనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రభాస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దర్శకుడు మాట్లాడుతూ ఈరోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూశాను. చాలా ఆనందంగా ఉంది. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. ప్రభాస్, పూజాహెగ్డే పాల్గొనే సన్నివేశాలతో త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం అన్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని తాజా చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో రూపొందించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, సంగీతం: అమిత్‌త్రివేది, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: గోపికృష్ణా మూవీస్ కృష్ణంరాజు, దర్శకత్వం: కేకే రాధాకృష్ణకుమార్.