రికార్డుస్థాయికి విద్యుత్ డిమాండ్

10,817 మెగావాట్లకు చేరిన వినియోగం -మూడురోజుల్లో 11 వేల మెగావాట్లకు! -సిద్ధంగా ఉన్నాం: సీఎండీ ప్రభాకర్‌రావు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠస్థాయికి చేరింది. మంగళవారం ఉద యం 7:31 గంటలకు మొదటిసారిగా 10,817 మెగావాట్లను చేరుకున్నది. అయినా విద్యుత్ సంస్థలు ఎలాంటి అంతరాయంలేకుండా కరంటు సరఫరా చేశాయి. నాలుగురోజుల కిందట 10,544 మెగావాట్ల తో నమోదైన రికార్డు మంగళవారం బద్దలయ్యింది. వానకాలం పంటల సమయం కావడంతో గరిష్ఠంగా విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని ముందు నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ సంస్థలను సమాయత్తం చేశారు. అనుకున్నట్టుగానే నాలుగైదు రోజులుగా డిమాండ్ పెరుగుతూ మంగళవారం 10,817 మెగావాట్లకు చేరుకున్నది. విద్యుత్ డిమాండ్ శుక్రవారంనాటికి 11 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేశామని, అందుకు సిద్ధంగా ఉన్నామని సీఎండీ తెలిపారు.

ఎస్పీడీసీఎల్ సీఎండీకి విద్యుత్ ఉద్యోగుల సన్మానం

మంచి పీఆర్సీ ఇప్పించినందుకు సీఎం కేసీఆర్, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు కృతజ్ఞతలు ఎవరూ ఊహించనివిధంగా అత్యధిక పీఆర్సీ ఇప్పించినందుకు కృతజ్ఞతగా విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలువురు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిని మంగళవారం సన్మానించారు. సీఎండీ చాంబర్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్య, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. భారీ పీఆర్సీ ప్రకటించిన సీఎం కేసీఆర్, అందుకు ఒప్పించిన ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీఏవోఏటీ కంపెనీ సెక్రటరీ వీరాస్వామి, రవికుమార్, శెట్టి, పరమేశ్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.