ఆకాశం నుంచి ఊడి పడింది.. ఏంటది.. ఏలియన్స్ పనేనా..!

అది మిసైలా... బాంబా... ఉల్కనా.. లేదంటే ఏలియన్స్ పంపించిన గిఫ్టా? ఏంటది... గూర్గావ్ దగ్గర్లోని ఫజిల్‌పూర్ బడ్లి గ్రామానికి చెందిన ప్రజలు ముందుగా దాన్ని వీటిలో ఏదో ఒకటి అయి ఉంటుందనుకున్నారు. తమ గ్రామానికి ఇక మంచి రోజులు వచ్చాయనుకున్నారు. తమ గ్రామానికి దేవుడు కరుణించాడనుకున్నారు? కాని.. వాళ్ల ఆనందం, ఆశ్చర్యం, ఆతృత కొన్ని క్షణాల్లోనే ఎగిరిపోవడమే కాదు.. అసలు నిజం తెలిసే సరికి నోరెళ్లబెట్టడం వాళ్ల వంతయింది. అసలు ఏంటా స్టోరీ.. కంపు కొట్టినా.. ముక్కు మూసుకొని చదవండి...ప్లీజ్ ఫజిల్‌పూర్ బడ్లి గ్రామానికి చెందిన రాజ్‌బిర్ యాదవ్ తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇంతలో ఆకాశంలో ఏదో ఉరిమినట్లు పెద్ద సౌండ్ వినిపించింది అతడికి. వెంటనే తన పొలం పక్కనే ఓ పెద్ద రాయిలా ఉన్న ఓ వస్తువు దబేలున ఆకాశం నుంచి ఊడి పడింది. దాన్ని చూసి భయపడిన రాజ్‌బిర్.. వెంటనే ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో ఆ న్యూస్ ఆ ఊరు అంతా వ్యాపించడం... వెంటనే ఊరు జనం అంతా ఆ ప్రదేశానికి వచ్చి ఆ వింత వస్తువును చూస్తూ నిలబడిపోయారు. ఆకాశం పైనుంచి అది పడటంలో ఒక అడుగులోపలికి వెళ్లి ఆ ప్రాంతమంతా కన్నం ఏర్పడింది. ఏంటది.. మిసైలా.. బాంబా.. ఉల్కాపాతమా... అసలేంటది... ఆ ప్రాంతంలో గుమికూడిన వ్యక్తులు గుసగుసలాడుకున్న మాటలవి. లేదంటే.. ఏలియల్స్ పంపించిన గిఫ్టా అని వాళ్లలో వాళ్లే తెగ డిస్కస్ చేసుకున్నారు. బాలీవుడ్ మూవీ కోయ్ మిల్ గయాలో జాదూ అనే ఏలియన్ భూమి మీదికి వచ్చినట్లుగా ఇది కూడా ఏదైనా ఉండి ఉంటుందా అని మరి కొంతమంది తమ మెదడుకు పదును పెట్టారు. ఇంకొందరైతే దాని నుంచి విరిగిపడ్డ ముక్కలను దొంగలించి తమ ఫ్రిడ్జిలో దాచుకున్నారు. అదేమైనా వజ్రమో.. వైడుర్యమో అన్న నమ్మకంతో. ఇలా.. ఎవరికి వారు వాళ్ల మెదడుకు పదును పెట్టి దాని గురించి ఊహాగానాలు సృష్టిస్తున్న క్రమంలో తర్వాత అసలు విషయం తెలిసింది. పటౌడీకి చెందిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ వివేక్ కాలియా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, మెటరోలాజికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. దానిపై పరిశోధనలు ప్రారంభించారు. దీంతో దాని అసలు విషయం బయటపడింది. అది.. వజ్రం కాదు.. వైడుర్యం అంతకన్నా కాదు.. ఏలియన్స్ గిఫ్ట్... మిసైల్... ఉల్కాపాతం.. ఇలా గ్రామస్థులు అనుకున్న ఏ ఒక్కటీ కాదు. మరేంటి.. అది హ్యూమన్ వేస్ట్. అంటే.. మనిషి మలం. విమానంలో మనిషి మలమూత్ర విసర్జనలను స్టోర్ చేయడానికి బ్లా ఐస్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఆ బ్లూ ఐస్‌తో మనిషి మలాన్ని గడ్డకట్టిస్తారు. అదే.. విమానం వెళ్తున్న సమయంలో జారి కింద పడిపోయింది. అగ్గది అసలు సంగతి. ఇదే విషయాన్ని ఆ గ్రామస్థులకు వివేక్ వివరించాడు. వెంటనే దాని శాంపిల్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. త్వరలోనే దానికి సంబంధించిన అన్ని రిపోర్టులు రానున్నాయని వివేక్ తెలిపాడు. ఇక.. అసలు విషయం తెలుసుకున్న ఆ ఊరి జనాలు తాము దొంగలించిన దాని ముక్కలను ముక్కు మూసుకొని మరీ అవతల పడేశారు.
× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి