ఘనంగా పొలాల అమావాస్య

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/దండేపల్లి: పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశువులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఏటా జరిపే పొలాల అమవాస్య పండుగను రైతులు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ, జైతుగూడ గిరిజన గూడేలు, కోటపల్లి, మందమర్రి, చెన్నూరు మండలాల్లో, కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లాలోని ఆసిఫాబాద్, జైనూర్, లింగాపూర్, కాగజ్‌నగర్, దహెగాం, సిర్పూర్ (యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లో గిరిజనులు, రైతులు ఉరూరా ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని ఎడ్లను పసుపుకుంకుమలు, కాళ్లకు గజ్జెలతో అందంగా అలంకరించారు. గ్రామ పరిసరాల్లో ర్యాలీగా తిప్పారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఇంటిల్లిపాది ఈ పూజల్లో పాల్గొని సకాలంలో వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.