డీజిల్ శాంతించినా.. ఆగని పెట్రోల్ పోటు

హైదరాబాద్‌లో రూ.87.40కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: డీజిల్ ధరలు విరామం తీసుకున్నా.. పెట్రోల్ ధరలు మాత్రం శాంతించడం లేదు. శనివారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో మరో 12 పైసలు ఎగిసి రూ.82.44కు చేరింది. డీజిల్ మాత్రం 73.87 వద్ద యథాతథంగానే ఉన్నది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్ రేటు 11 పైసలు పెరిగి రూ.87.40కు చేరగా, డీజిల్ రూ.80.35 వద్దే స్థిరపడింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర 11 పైసలు ఎగబాకడంతో గరిష్ఠంగా రూ.89.80ని తాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో చాలాచోట్ల రూ.91కిపైగా పలుకుతున్న విషయం తెలిసిందే. కాగా, డీజిల్ ధర రూ.78.42 వద్ద స్థిరంగా ఉన్నది. దేశవ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి డీజిల్ ధరల్లో మార్పులు లేని విషయం తెలిసిందే. అయితే వరుస పెంపుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకున్న పెట్రోల్ ధరలు.. గత మూడు రోజుల నుంచి ఎగబాకుతూనే ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల్ని దాదాపూ రోజూ పెంచుకుంటూపోతున్న సంగతి విదితమే. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ధరలు రికార్డు స్థాయిల్లో కదలాడుతున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తుండగా, సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేసేస్తున్నాయి. ఈ నెల 10న పెట్రో ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు భారత్ బంద్‌ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్‌పై రూ.15.33, పెట్రోల్‌పై రూ.19.48 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నది. దీనిపై ఆయా రాష్ర్టాలు మళ్లీ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వేస్తున్నాయి. దీంతో ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య తొమ్మిదిసార్లు డీజిల్‌పై రూ.13.47, పెట్రోల్‌పై రూ.11.77 మేరకు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. తీవ్ర వ్యతిరేకతల నడుమ గతేడాది అక్టోబర్‌లో మాత్రం ఒక్కసారి లీటర్‌పై రూ.2 చొప్పున తగ్గించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం రూ.99,184 కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఇది రూ.2,29,019 కోట్లకు పెరుగడం గమనార్హం. అయినప్పటికీ సుంకాలను తగ్గించడానికి మోదీ సర్కారు ససేమిరా అంటున్నది. లీటర్‌పై రూపాయి చొప్పున తగ్గించినా ఖజానాకు రూ.14,000 కోట్ల రాబడి దూరమవుతున్నది. ఈ నిర్ణయం కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) లక్ష్యాలను దెబ్బతీయగలదని కేంద్రం వాదిస్తున్నది.

జీఎస్టీలోకి వస్తే ధరలు తగ్గవ్

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ఇప్పుడున్న ధరలు తగ్గుతాయన్నదేమీ లేదని బీహార్ ఆర్థిక శాఖ మంత్రి, జీఎస్టీ మంత్రుల బృందం (టెక్నాలజీ) చైర్‌పర్సన్ సుశీల్ కుమార్ మోదీ అన్నారు. శనివారం ఇక్కడ మంత్రుల బృందం సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 28న జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ ఆదాయాన్ని సుస్థిరపరుచడం, వాణిజ్య, వ్యాపారుల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యతన్న మోదీ.. ఆ తర్వాతే జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్‌ను తీసుకువచ్చే అంశం చర్చకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్ల ఆధారంగా మారే ఇంధన ధరల్ని జీఎస్టీ కిందకు తెచ్చినంతమాత్రాన తగ్గుతాయనుకోవడం తగదన్నారు. పన్నులుగా రాష్ర్టాలు లేదా కేంద్ర ప్రభుత్వ లేవీల్ని అదుపు చేయలేమని, జీఎస్టీలో నిర్ణయించిన పన్నుపై అదనంగా పన్నులను వేసినావేయవచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం. జీఎస్టీలోకి పెట్రో ధరలను తీసుకురావాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుశీల్ మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.