మండిపోతున్న ఇంధనం

-పెట్రో ధరలు మరింత ప్రియం -ఆల్‌టైమ్ హైకి చేరిక -హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.85.60 -డీజిల్ రూ.79.22 -మహారాష్ట్రలో పెట్రోల్ రేటు రూ.90 పలుకుతున్న వైనం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకో రికార్డు స్థాయిని తాకుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 23 పైసలు ఎగిసి రూ.80.73, డీజిల్ ధర 22 పైసలు ఎగబాకి రూ.72.83 పలికాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు 25 పైసలు పెరిగి రూ.85.60, డీజిల్ రేటు 24 పైసలు అందుకుని 79.22 వద్దకు చేరాయి. ఇక మహారాష్ట్రలోని పర్భని పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా రూ.90 (రూ.89.97) పలుకుతుండటం గమనార్హం. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య దేశీయ ముడి చమురు దిగుమతులు భారమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల్ని వరుసగా పెంచేస్తున్నాయి. ఆగ స్టు మధ్య నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ. 3.65, డీజిల్‌పై రూ.4.06 చొప్పున బాదాయి.

అంతర్జాతీయ కారణాలే: అసోచామ్

పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై రికార్డు స్థాయిల్లో కదలాడటానికి కారణం అంతర్జాతీయ పరిణామాలేనని వ్యాపా ర, పారిశ్రామిక సంఘం అసోచామ్ అన్నది. అయి తే పన్నుల భారాన్ని తగ్గిస్తే ధరలు అదుపులోకి వస్తాయన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే జీఎస్టీలోకి పెట్రో ధరలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అసోచామ్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ వర్మ పీటీఐతో సోమవారం అన్నారు.

ఇలా కూడా ధరల్ని తగ్గించవచ్చు

పెట్రో ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్ర ఎక్సైజ్ పన్నులను తగ్గించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ ఇందుకు మోదీ సర్కారు ససేమిరా అంటున్నది. ఆదాయం తగ్గి ఆర్థిక లోటు పెచ్చుమీరుతుందని చెబుతున్నది. అయితే వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఇంధన ధరల్ని అదుపులోకి తేవాలంటే పన్నులనే తగ్గించాలా?.. మరో మార్గం లేదా?.. అంటే ఉన్నాయని చెప్పొచ్చు.

జీఎస్టీలోకి తేవాలి

పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రస్తుతం 50 శాతానికిపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఉన్నాయి. ఈ క్రమంలో పెట్రో ధరలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకువస్తే ఈ పన్ను పోట్లు తగ్గే వీలున్నది. జీఎస్టీలో గరిష్ఠ శ్లాబు 28 శాతం. ఇది చాలదనుకుంటే ప్రభుత్వం ప్రత్యేకంగా 40 శాతం పన్నునైనా పెట్టుకోవచ్చు. అలా చేసినా ఇప్పుడున్న పన్నుల భారం తగ్గి ధరలు దిగివస్తాయి.

రిటైలర్లకు చౌకగా సరఫరా

దేశీయ ముడి చమురు అవసరాల్లో సుమారు 20 శాతం వరకు ఓఎన్‌జీసీ ద్వారానే తీరుతున్నాయి. ఇంధన ధరలు రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలకు ముడి చమురును ఓఎన్‌జీసీ చౌకగా సరఫరా చేయాలి. దీంతో రిటైలర్లు ఇంధన ధరల్ని తగ్గిస్తారు. ఇందుకు బదులుగా ఓఎన్‌జీసీ నుంచి ప్రభుత్వం తక్కువ డివిడెండ్‌ను తీసుకుంటే సరిపోతుంది.

ఫ్యూచర్స్ ట్రేడింగ్

పెట్రోల్, డీజిల్‌పై ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించాలి. భవిష్యత్తులో ఓ సమయానికి ఇంధనాన్ని సరఫరా చేసేలా నిర్ణీత ధరకు ఈ కాంట్రాక్టులను కొనుగోలు చేయడానికి వినియోగదారులను అనుమతించాలి. దీనివల్ల డెలివరీనాడు మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నా తక్కువ ధరకే ఇంధనాన్ని అందుకునే వెసులుబాటు దక్కుతుంది. నిలకడలేని ధరల మధ్య కస్టమర్లకు ఇది ఒకింత ఊరటే.

ఒపెక్ దేశాలపై ఒత్తిడి

పెట్రో ఉత్పత్తుల ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్)పై ఒత్తిడి తీసుకువచ్చి ముడి చమురు దిగుమతులపై రాయితీని పొందవచ్చు. భారత్‌సహా ఆసియా దేశాలకు ఒపెక్ నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతులు అవుతున్నాయి. దిగుమతిదారులంతా ఏకమైతే రాయితీని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సబ్సిడీ వస్తే ధరలు తగ్గి మార్కెట్‌లో ఇంధన ధరలు అదుపులోకి వస్తాయి.

Related Stories: