పెట్రో ల్@ 90

-దేశవ్యాప్తంగా ఆల్‌టైమ్ హైలో ఇంధన ధరలు -ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.90.17.. - హైదరాబాద్‌లోడీజిల్ రూ.80.51
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: పెట్రో ధరలు ఠారెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న ఇంధనం విలువ సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. సోమవారం లీటర్ పెట్రోల్ ధర ముంబైలో తొలిసారిగా రూ.90 మార్కును దాటేసింది. ఆదివారంతో చూస్తే 11 పైసలు పెరిగి రూ.90.08గా నమోదైంది. ఇది ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) బంకుల్లో రేటే. భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) బంకుల్లో రూ.90.14గా, హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) బంకుల్లో రూ.90.17గా ఉండటం గమనార్హం. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమవుతుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటివి దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. డీజిల్ ధర కూడా ముంబైలో 5 పైసలు అందుకుని రూ.78.58కి (ఐవోసీ) చేరింది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకుల్లో రూ.78.67గా ఉన్నది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ.82.72గా, డీజిల్ రూ.74.02గా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 12 పైసలు ఎగబాకి రూ.87.70గా, డీజిల్ 5 పైసలు అందిపుచ్చుకుని రూ.80.51 వద్ద నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఈ క్రమంలో రూపాయి మారకం విలువ పడిపోతుండటం, గ్లోబల్ మార్కెట్‌లో ధరలు ఎగిసిపడుతుండటం భారత్‌ను ప్రభావితం చేస్తున్నాయి. కాగా, ముడి చమురు దిగుమతి ధర పెట్రోల్‌కు రూ.42.04గా, డీజిల్‌కు రూ.45.34గా ఉంటున్నదని చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. వీటిపైన కేంద్ర ఎక్సైజ్ పన్నులు, రాష్ట్ర విలువ ఆధారిత పన్నులు (వ్యాట్), డీలర్ల కమీషన్లు ఉండటంతో పెట్రోల్ ధర రూ.90ని, డీజిల్ ధర రూ.80ని దాటిపోయాయి. ఆగస్టు 16 నుంచి డీజిల్ ధర రూ.5.30, పెట్రోల్ ధర రూ.5.58 మేర ఎగబాకాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్‌పై రూ.15.33, పెట్రోల్‌పై రూ.19.48 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నది. డీలర్ కమీషన్ డీజిల్‌పై రూ.2.52, పెట్రోల్‌పై రూ.3.66గా ఉన్నాయి. ఆయా రాష్ర్టాల్లో వ్యాట్ భారం వేర్వేరుగా పడుతున్నది.

100 డాలర్లకు క్రూడ్?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 80 డాలర్లను దాటేసింది. అమెరికా వెనుజులాల మధ్య ఉద్రిక్తతు పెరుగుతుండంతో పాటు అమెరికా ఆయిల్ రిగ్ కౌంట్ తగ్గాయన్న వార్తలు క్రూడాయిల్ ధరలు ఒక్కసారి రెండున్నర శాతం మేర పెరగడానికి దోహదపడ్డాయి. దీనికితోడు ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా అంక్షలు దగ్గరపడుతున్నందున వారంతంలో అల్జీర్స్‌లో జరిగే ఓపెక్ దేశాల సమావేశంలో సప్లయ్‌లను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే క్రూడ్ డిమాండ్ పెరిగందన్న వార్తలతో సప్లయ్ డిమాండ్‌ల మధ్య వ్యత్యాసం పెరగడంవల్ల వంద డాలర్లకు కూడా చేరుకోవచ్చునన్న అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో క్రూడాయిల్ ధరలు రూ. 5250 అధిగమించి ట్రేడ్ అవుతున్నాయి.