ఓవైపు భారత్ బంద్.. అయినా పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: ఓవైపు పెరుగుతున్న పెట్రో ధరలను నిరసిస్తూ ప్రతిపక్షాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయినా ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రో ధరలను పెంచడం గమనార్హం. ఈ పెంపుతో మరోసారి ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.88.12కు చేరింది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ. 77.32ను తాకింది. అటు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.80.73గా ఉండగా.. డీజిల్ ధర రూ.72.83కు చేరింది. మన హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.85.60కు చేరడం విశేషం. డీజిల్ ధర రూ.79.22గా ఉంది.

ఆగస్ట్ 1 నుంచి పెట్రోల్ ధరలు ఐదు శాతం మేర, డీజిల్ ధరలు 7 శాతం మేర పెరిగాయి. సోమవారం రూపాయి జీవితకాల కనిష్ఠానికి ( రూ.72.18) చేరడంతో పెట్రో ధరలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర 77 డాలర్లుగా ఉంది. ముడి చమురులో 80 శాతం దిగుమతుల ద్వారానే భారత్‌కు వస్తున్నాయి. దీంతో రూపాయి విలువ క్షీణించడం ధరలను మరింత పెంచుతున్నది.

× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం