సీఎంతో కలెక్టర్లు

-రాష్ట్ర కలెక్టర్ల బృందంతో కలిసి సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన -సింగాయపల్లి అటవీ పునరుద్ధరణ ప్రాంతం, మిషన్ భగీరథ ప్లాంట్ సందర్శన -అడవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు కేసీఆర్ సూచన -సీఎం వెంట ఉమ్మడి జిల్లా అమాత్యులు ఈటల, కొప్పుల కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర కలెక్టర్ల బృందం, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూర్, కోమటిబండ ప్రాంతాల్లో చేపట్టిన అడవుల పునరుద్ధరణను పరిశీలించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయనీ, ఈ ప్రాంతమంతా పచ్చదనం పరుచుకున్నదని సంతోషం వ్యక్తం చేశారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనీ, మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు సూచించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలనీ, ఇందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అనంతరం గజ్వేల్ సమీపంలోని మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. ఈ పర్యటనలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, శ్రీ దేవసేన, కృష్ణభాస్కర్‌తోపాటు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పర్యాటక శాఖ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్ ఉన్నారు.
More