ఎయిర్‌పోర్ట్ దిశగా..

-జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు అడుగులు -బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్‌లోనే నెలకొల్పే అవకాశాలు -ఇప్పటికే 778 ఎకరాల స్థలం గుర్తింపు -ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదముద్రే తరువాయి -22న పరిశీలనకు బృందం రాక -సాకారందిశగా దశాబ్దాల కల -నెరవేరితే నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం
పాలకుర్తి:పారిశ్రామిక కారిడార్ పేరొందిన జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల నెరవేరే తరుణం ఆసన్నమవుతున్నది. ఇప్పటికే బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద పలుసార్లు సర్వే చేయించి 778 ఎకరాల స్థలాన్ని గుర్తించి, వేగంగా అడుగులు వేస్తున్నది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించగా, సదరు బృందం గురువారం ఈ ప్రాంతంలో పర్యటించబోతున్నది. ఏఏఐ ఆమోదముద్రే తరువాయి జిల్లాకు విమానయోగం పట్టనుండగా, నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగనున్నది. దూరప్రాంతాలకు తక్కువ సమయంలో వెళ్లే వైమానిక వ్యవస్థను రాష్ట్రంలో వీలైన ప్రాంతాలన్నింటిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో మినీ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై మొదటి నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తుండగా, కొద్దిరోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్రంలో బసంత్‌నగర్(రామగుండం)తోపాటు, ఆదిలాబాద్, నిజామాబాద్(జాక్రాన్‌పల్లి) వరంగల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించి, ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నది. తాజాగా సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కట్టబెట్టగా, 22న ఏఏఐ బృంద సభ్యులు బసంత్‌నగర్‌లో పర్యటించబోతున్నారు. -గతంలోనే సర్వే పూర్తి.. బసంత్‌నగర్‌లో పూర్వం బిర్లా యాజమాన్యం 35 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మించింది. బీకే బిర్లా ఇటీవల మృతిచెందగా, అప్పట్లో ఆయన ఏడాదికి రెండుసార్లు కలకత్తా నుంచి ప్రత్యేక విమానంలో బసంత్‌నగర్‌కు వచ్చేవారు. 1975 నుంచి 1982 దాకా బసంత్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు విమానం సైతం నడిపారు. నిర్వహణ ఖర్చు అధికం కావడంతో విమానాన్ని రద్దుచేశారు. బీకే బిర్లా సైతం గడిచిన ఏడేళ్లుగా ఇక్కడికి రాకపోవడంతో బసంత్‌నగర్ విమనాశ్రయం నిరుపయోగంగా మారింది. బిర్లా యాజమాన్యం సైతం సదరు 35 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి లీజుకు ఇవ్వగా, ఇక్కడి ఎయిర్‌స్ట్రిప్‌లోనే సర్కారు కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న స్థలంతోపాటు అదనంగా కుర్మపల్లి, బసంత్‌నగర్, పాలకుర్తి, రాగినేడు పంచాయతీల పరిధిలోని సర్వే నంబర్ 363లో 292 ఎకరాలు, 301లో 281 ఎకరాలు, 413లో 205 ఎకరాలు స్థలాన్ని రెవెన్యూశాఖ సర్వే చేసి ప్రభుత్వానికి అందజేసింది. స్థలం సర్వే సమయంలో కలెక్టర్, జేసీతోపాటు ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ సైతం ఈ ప్రాంతాన్ని పలుసార్లు సందర్శించి, ప్రభుత్వానికి నివేదించారు. -ఇక్కడి పరిశ్రమల్లో దేశవ్యాప్త ఉద్యోగులు.. సింగరేణి, ఎన్టీపీసీ, నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు జైపూర్ పవర్‌ప్లాంట్, జెన్‌కో బీ థర్మల్‌కేంద్రం, కేశోరాం సిమెంట్ కర్మాగారాల్లో బయటి ఉద్యోగులే ఎక్కువ. దేశంలోని వివిధ రాష్ర్టాల ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తుండడంతో రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలు మినీ భారతాన్ని తలపిస్తుంటాయి. ఇక్కడి తమ వ్యాపార, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇక్కడి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు నిత్యం హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ విమానాశ్రయం ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి, ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విమానాశ్రయం నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్నది. -నాలుగు జిల్లాలకు ప్రయోజనం.. బసంత్‌నగర్ విమానాశ్రయం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అలాగే కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలాకు కేవలంలో 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, పారిశ్రామికంగా ఇక్కడ కేంద్ర, రాష్ట్ర పరిశ్రమలతోపాటు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్నాయి. రాజీవ్హ్రదారిని ఆనుకుని ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఈ ప్రాంతవాసులందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని సర్కారు భావించి, రంగం సిద్ధం చేస్తున్నది. -22న ఏఏఐ అధికారుల రాక.. బసంత్‌నగర్ ఎయిర్‌స్ట్రిప్ సమీపంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించి, సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతలను ఏఏఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఏఏఐ అధికారులు అమిత్‌కుమార్, నీరజ్‌గుప్తా, కుమార్‌వైభవ్ గురువారం బసంత్‌నగర్ ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులతోపాటు, ప్రయాణికులసంఖ్య, వాణిజ్యం, సైనిక అవసరాలను ఏఏఐ కమిటీ అధ్యయనం చేయబోతున్నది. ఏదీ ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
More