పీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి

కరీంనగర్ స్పోర్ట్స్: వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఆర్డర్లను ఆమోదించాలన్నారు. హెచ్‌ఎంలు డీఈఓ ఆర్డర్ పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. గత రెండేళ్లుగా ఎస్జీఎఫ్ జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించిన కార్యదర్శి రొండి నర్సయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన పదవీ కాలం పూర్తయినందున జిల్లా విద్యాధికారితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు సన్మానించి, వీడ్కోలు పలికారు. రొండి నర్సయ్య క్రీడా నివేదికలను సమర్పించారు. అనంతరం ఎస్జీఎఫ్ నూతన కార్యదర్శిగా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కనకం సమ్మయ్యను నియమించగా, డీఈఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల కార్యదర్శులు మిలుకూరి సమ్మిరెడ్డి, జంగంపల్లి వెంకటనర్సయ్య, గిన్నె లక్ష్మణ్‌కుమార్, ఎండీ యూనిస్‌పాషా, కె కృష్ణ, రాజగోపాలచారి, పెటా సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి రవి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
More