హార్దిక్ పటేల్ దీక్ష విరమణ

- చర్చలకు ముందుకురాని గుజరాత్ ప్రభుత్వం - రిజర్వేషన్ల కోసం తన పోరాటం కొనసాగుతుందన్న హార్దిక్ అహ్మదాబాద్, సెప్టెంబర్ 12: పలు డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నాయకుడు హార్దిక్ పటేల్ దీక్ష విరమించారు. బుధవారం పాటిదార్ నాయకులు అందించిన నిమ్మరసం తాగారు. పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని, అరెస్టు చేసిన పాస్ నేతను విడుదల చేయాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25న తన ఇంట్లోనే హార్దిక్ పటేల్ దీక్షకు దిగారు. 19 రోజులు గడిపినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ముందుకురాలేదు. దీంతో చివరకు ఆయనే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. పాటిదార్లకు రిజర్వేషన్, రైతుల రుణమాఫీ కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ప్రకటించారు. గత శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానలో చేర్పించగా, ఆ సమయంలో కేవలం ద్రవ పదార్థాలు తీసుకున్న హార్దిక్.. ఘనపదార్థాలు ముట్టుకోబోనని స్పష్టంచేశారు. రెండురోజులపాటు దవాఖానలో ఉన్న ఆయన.. తిరిగి ఇంటికి చేరుకొని నిరాహార దీక్షను కొనసాగించారు. దీక్ష సమయంలో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని హార్దిక్ భావిస్తున్నారు. పాటిదార్ సంఘాల విజ్ఞప్తి మేరకు హార్దిక్ దీక్ష విరమించారని, ఆయన ఆరోగ్యంగా ఉండి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారని పాస్ కన్వీనర్ తెలిపారు.