తెలంగాణ రమణీయతకు దక్కిన గౌరవమిది

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండలికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64వ జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు పెళ్లిచూపులు, శతమానంభవతి అవార్డుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ శతమానంభవతి చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు సతీష్‌వేగేశ్నతో పాటు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాత రాజ్‌కందుకూరి, ైస్టెలిష్ట్ లతానాయుడు, హీరో విజయ్ దేవరకొండ, 2012, 2013 సంవత్సర నంది అవార్డుల విజేతలైన మామిడి హరికృష్ణ, రవిచంద్ర, వంశీకృష్ణ, నందగోపాల్‌లను మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగువారందరికి ఆనందదాయకంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన దర్శక నిర్మాతల్ని ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవించడం అభినందనీయం. అని తెలిపారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ మూసధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో కథాబలమున్న చిన్న సినిమా పెళ్లిచూపులు జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవడం గర్వకారణం. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మక కథాంశాలు, నూతన ఒరవడితో కూడిన మంచి సినిమాలు అనేకం రూపొందుతున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. విలువలతో కూడిన మంచి సినిమాలు రావడంలేదు. కొత్త సినిమాల్లో సంగీతం, సాహిత్యం పతనమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో శతమానం భవతిలో పల్లెటూరి వాతావరణాన్ని, పెద్దలకు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు. పెళ్లిచూపులు సినిమాకుగాను మాటల రచయితగా తరుణ్‌భాస్కర్‌కు అవార్డు రావడం గర్వకారణంగా చెప్పవచ్చు. హైదరాబాద్ యాస, భాషలోని రమ్యతను సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిన్న సినిమాలకు అవార్డులు రావడం పట్ల తెలుగు చిత్రపరిశ్రమలోని పెద్ద నిర్మాతలు, సంస్థలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ పట్ల సినీ పరిశ్రమ ఆలోచన ధోరణినిని సవరించుకోవాల్సిన అవసరముంది. ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమని గుర్తించాలి. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎక్కడికి తరలిపోదు. ఇక్కడే మనుగడ సాగిస్తుంది అని అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలను చేకూర్చేలా సీఏం కేసీఆర్ అనేక ప్రణాళికలు, పథకాల్ని అమలు చేస్తున్నారు. రేపటి తెలంగాణ సినిమాకు పెళ్లిచూపులు చిత్రం చక్కటి నాందిగా నిలిచింది. భవిష్యత్తులో తెలంగాణ సినిమా తనదైన ముద్రతో ఎదుగుతుందనడానికి పెళ్లిచూపులు, అప్పట్లో ఒకడుండేవాడు, ఘాజీ సినిమాల్ని నిదర్శనంగా చెప్పవచ్చు అని పేర్కొన్నారు. శతమానంభవతి లాంటి మంచి సినిమా ప్రేక్షకుల్లోకి తీసుకుపోవడానికి, అవార్డులు తెచ్చిపెట్టడానికి కారణమైన ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి సన్మానాన్ని పొందడం ఆనందంగా ఉందని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్‌భాస్కర్, విజయ్‌దేవరకొండ, సతీష్‌వేగేశ్న, రాజ్‌కందుకూరి, సమాచార హక్కు కమీషనర్ విజయ్‌బాబు, ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఏరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సెక్రటరీ మడూరి మధు, కోశాధికారి రాంబాబు, జాయింట్ సెక్రటరీ సాయిరమేష్, సీనియర్ సినీ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి, ప్రభు, గీతాభాస్కర్, లతానాయుడు, ప్రత్యగాత్మ, సురేష్ కొండేటితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.