నరకం చూపించిన విమాన ప్రయాణం

-జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది నిర్లక్ష్యం -ప్రయాణికుల ముక్కు, చెవుల్లోంచి రక్తం -30మందికి అస్వస్థత.. స్వల్పంగా వినికిడి శక్తిని కోల్పోయిన ఐదుగురు
ముంబై, సెప్టెంబర్ 20: జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 30మంది ప్రయాణికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు స్వల్పంగా వినికిడి శక్తిని కోల్పోయారని వైద్యులు తెలిపారు. గురువారం 166మంది ప్రయాణికులతో ముంబై నుంచి జైపూర్‌కు జెట్ ఎయిర్‌వేస్ బోయిన్-737 విమానం బయల్దేరింది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన విమాన సిబ్బంది.. క్యాబిన్‌లో వాయు పీడనాన్ని నియంత్రించే స్విచ్‌ను ఆన్ చేయడం మరిచిపోయారు. ఫలితంగా గాలి ఒత్తిడి తీవ్రంగా ఏర్పడి 30మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. కొందరికి ముక్కు, చెవుల నుంచి రక్తం కారగా, మరికొందరు తలనొప్పితో బాధపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పొరపాటును గ్రహించిన సిబ్బంది విమానాన్ని తిరిగి ముంబైలో ల్యాండ్‌చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని దవాఖానకు తరలించారు.

ఐదుగురు ప్రయాణికులు అన్వేషన్ రే (39), ముకేశ్ శర్మ (31), వికాస్ అగర్వాల్ (31), దామోదర్ దాస్ (37), అంకుర్ కాలా (38) వినికిడిశక్తి సన్నగిల్లిందని నానావతి దవాఖాన వైద్యులు తెలిపారు. వారంతా బారోట్రామా (గాలిఒత్తిడిలో మార్పు కారణంగా చెవి దెబ్బతినడం) బారినపడ్డారని.. పదిరోజుల్లో వారు పూర్తి వినికిడి శక్తిని తిరిగి పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పౌరవిమానయానశాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విమాన సిబ్బందిని విధుల నుంచి తప్పించడంతోపాటు, ఈ ఘటనపై ఏఏఐబీతో విచారణకు ఆదేశించింది. అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికుల భద్రతాప్రమాణాలను తక్షణమే తనిఖీ చేయాలని విమానయానశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించారు.

సిబ్బంది పట్టించుకోలేదు..

జెట్ ఎయిర్‌వేస్ విమాన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత ప్రయాణికులు ఆరోపించారు. విమానం టేకాఫ్ కాగానే ఎయిర్ కండీషన్లు పనిచేయలేదు. మొదట ఉక్కపోతకు గురైన ప్రయాణికులు క్రమంగా ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. ప్రయాణికులు గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. 20 నిమిషాలపాటు నరకం చూశాం. ఘటన జరిగినప్పుడు విమానంలో ఉన్న సిబ్బంది అందరూ ట్రెయినీలే. వారికి పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో కూడా తెలియలేదు అని బాధితుడు అంకుర్ కాలా తెలిపారు.

Related Stories: