పార్టీ గీతాలు

అమ్మ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం పార్టీ. జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. వెంకట్‌ప్రభు దర్శకుడు. టి. శివ నిర్మాత. ప్రేమ్‌జీ అమరన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్) వల్ల కలిగిన ఇబ్బందుల్ని చర్చించే చిత్రమిది. పీఎం ప్రసంగంతో ఈ సినిమా మొదలవుతుంది. సందేశాన్ని అందిస్తూనే వినోదాన్ని పంచుతుంది అన్నారు. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. వినోద ప్రధానంగా సాగే కథాంశమిది. చిత్రీకరణ మొత్తం ఫిజీ ఐలాండ్స్‌లో జరిగింది. తమిళంలో పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. తెలుగులో కూడా సంగీతప్రియుల్ని అలరించాలని కోరుకుంటున్నాను అని రమ్యకృష్ణ తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని సత్యరాజ్ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ వినూత్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు. చంద్రన్, మిర్చి శివ, నివేథా పెతురాజ్, సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, ఆర్ట్: విదేశ్, సంగీతం: ప్రేమ్‌జీ అమరన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జ్యోతి, దిలిబాన్.