సొగసు ముసుగులో గూఢచర్యం

-అందమైన యువతుల ఫొటోలతో సైనికులు, యువతకు ఎర -ఫేస్‌బుక్, సోషల్‌మీడియాను అస్త్రంగా ఎంచుకున్న పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ -ఫ్రెండ్ రిక్వెస్ట్, లైక్‌లతో ముగ్గులోకి లక్నో, సెప్టెంబర్ 21: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ రూటు మార్చింది. ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్‌ల పేరుతో అమ్మాయిల ఫొటోలను చూపిస్తూ(హనీ ట్రాప్) భారత సైనిక రహస్యాల్ని కొల్లగొట్టేందుకు ఫేస్‌బుక్, సోషల్ మీడియాను ఐఎస్‌ఐ సరికొత్త అస్త్రంగా ఎంచుకున్నది. భారత సైనిక బలగాలు, అమాయక యువతను లక్ష్యంగా ఎంచుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం, ఫేస్‌బుక్‌లో వారి కామెంట్లను లైక్ చేయడం, అందమైన అమ్మాయిల ఫొ టోలను షేర్ చేస్తూ అమాయకుల్ని ముగ్గులోకి దింపుతున్నది. యువతి ఫొటోతో ఉన్న అపరిచిత వ్యక్తి పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించారా? ఇక అప్పట్నుంచీ చాటింగ్, కామెంట్లు, ఫొటోల షేరింగ్ మొదలవుతుంది. మెల్లగా ఉచ్చులోకి దింపుతారు. కుశల ప్రశ్నలతో మొదలై సైనిక రహస్యాల వరకు ఈ సంభాషణ కొనసాగుతుంది. ఇటీవల నోయిడాలో పట్టుబడిన బీఎస్‌ఎఫ్ జవాన్ అచ్యుతానంద్ మిశ్రా ఉదంతమే ఇందుకు నిదర్శనం. పాక్‌కు చెందిన ఓ మహిళ డిఫెన్స్ రిపోర్టర్‌గా ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని మెల్లగా అతడిని ఉచ్చులోకి దింపి సైనిక రహస్యాల్ని కాజేసింది. ప్రస్తుతం అతడు యూపీ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కస్టడీలో ఉన్నాడు. అందమైన అమ్మాయి ఫొటోతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే జవాన్ మిశ్రా ఆకర్షితుడై ఆమె వలలో పడ్డాడు. కీలక సైనిక రహస్యాల్ని ఆమెకు చేరవేశాడు. జవాన్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన మహిళ ఫ్రెండ్‌షిప్ లిస్ట్‌లో ఏకంగా 90 మంది భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం సోషల్‌మీడియాను ఐఎస్‌ఐ తన అస్త్రంగా మలుచుకున్నది. సైనిక శిక్షణ కేంద్రాలు, ముఖ్య స్థావరాలు ఉన్న ప్రాంతంలోని యువతకు, అమాయకులకు ఐఎస్‌ఐ గాలం వేస్తున్నది. అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే ఆలోచించకుండా అంగీకరిస్తున్నారు. దీంతో ఐఎస్‌ఐ పని సులువవుతున్నది అని యూపీ ఏటీఎస్ ఐజీ అసిమ్ అరుణ్ మీడియాకు వెల్లడించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 19 ఏండ్ల నిరుద్యోగ యువకుడిని సైతం ఇలాగే ట్రాప్‌లోకి దింపారని ఐజీ అరుణ్ చెప్పారు. భారత్‌లో తమ తరుఫున పని చేయాలని, సైనిక రహస్యాలు అందజేయాలని ఇందుకోసం నెలకు రూ.4000 ఇస్తామంటూ అతడిని ఉచ్చులోకి దింపాలని యత్నించారని ఆయన పేర్కొన్నారు. కానీ, ఆ యువకుడు అనుమానంతో ఆమెతో చాటింగ్ నిలిపివేసినట్లు చెప్పారు. మరో ఘటనలో యువతి ఫొటోతో ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపి ఓ జవాన్‌ను ఆకర్షించారు. ముందు స్నేహం ఆ తర్వాత పెండ్లీ అంటూ కొద్దిరోజులు చాట్ చేశారు. సైన్యంలో పనిచేస్తున్న జవాన్ ట్రైనింగ్ ఫొటోలు, అక్కడి కార్యకలాపాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయమని కోరారు. ఇంతలోనే ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి జవాన్‌ను విధుల నుంచి తొలిగించింది. అపరిచిత వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించి చిక్కుల్లో పడవద్దని ఏటీఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Stories: