పార్టీని వీడ‌డం బాధ‌గా ఉంది : వెంక‌య్య‌నాయుడు

న్యూఢిల్లీ: బీజేపీ పార్టీని వీడ‌డం బాధ‌గా ఉంద‌ని ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడు తెలిపారు. ఇవాళ ఆయ‌న ఉప‌రాష్ట్ర‌ప‌తిగా నామినేష‌న్ వేసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడ‌డం ప‌ట్ల‌ తాను భావోద్వేగానికి గురువుతున్న‌ట్లు చెప్పారు. కేంద్ర మంత్రి ప‌దవుల‌కు రాజీనామా చేశాన‌ని, ఆ విష‌యాన్ని ప్ర‌ధానికి తెలియ‌జేసిన‌ట్లుచెప్పారు. చిన్న‌త‌నంలో త‌ల్లిని కోల్పోయాన‌ని, కానీ పార్టీనే త‌న తల్లిగా భావించాన‌ని, ఆ పార్టీ ఇప్పుడు త‌న‌ను ఈ స్థాయికి తీసుకువ‌చ్చిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. త‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నుకుంటే, ఆ సాంప్ర‌దాయాల‌ను పాటిస్తాన‌న్నారు. ఆఫీసు హుందాత‌నాన్ని కాపాడుతాన‌న్నారు. భార‌త‌దేశ సామ‌ర్థ్యం, అందం అంతా పార్ల‌మెంటరీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లోనే ఉన్న‌ద‌ని, ఆ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ భిన్న‌మైంద‌ని, దాని ప‌రిపాల‌నా వ్య‌వ‌హారం భిన్న‌మైంద‌ని, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆ ప‌ద‌వికి న్యాయం చేస్తాన‌ని ఆశిస్తున్న‌ట్లు వెంకయ్య తెలిపారు. త‌న‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, దాదాపు నాలుగు ద‌శాబ్ధాలుగా రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌ళ్లీ 2019లోనూ ప్ర‌ధాని మోదీ తిరిగి ఎన్నిక కావాల‌న్న ఆకాంక్ష‌ను త‌న స‌హ‌చ‌రుల‌కు తెలియ‌జేసిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. చ‌ర్చ‌ల త‌ర్వాత తాను పార్టీని వ‌దిలేందుకు నిర్ణ‌యించాన‌ని, ఇప్పుడు తాను బీజేపీ వ్య‌క్తిని కాద‌న్నారు.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..