ఐదు రోజుల్లో 8.5 లక్షల కోట్ల నష్టం

ముంబై: స్టాక్ మార్కెట్లు నిండా ముంచుతున్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు భారీగా పతనమైన మార్కెట్లు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను కొల్లగొట్టాయి. బీఎస్‌ఈ సూచి ఐదు రోజుల్లో ఐదు శాతం పతనమైంది. దీంతో రూ.8.47 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. సోమవారం 536.58 పాయింట్లు నష్టపోయి 36305.02 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ముగిసింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 1785.62 పాయింట్ల కోల్పోయింది. అమెరికాతో వాణిజ్య చర్చలను చైనా ఉపసంహరించుకుందన్న వార్త మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ షేర్లు దారుణంగా పతనమవుతూ మార్కెట్‌లను నష్టాల్లోకి తీసుకెళ్తున్నారు.

దీంతో ఇదే అంశంపై సోమవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌ను ఆదుకోవడానికి సరిపడా నగదు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. తీవ్రంగా నష్టపోయిన వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ఉన్నాయి. ఈ సంస్థ షేర్లు 6.46 శాతం మేర పతనమయ్యాయి. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 6.22 శాతం మేర, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 4.94 శాతం మేర, అదానీ పోర్ట్స్ షేర్లు 4.49 శాతం మేర నష్టపోయాయి. మొత్తంగా 2111 స్టాక్క్ నష్టపోగా, 538 లాభపడ్డాయి. మరో 168 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు.

Related Stories: