28న జూ. పంచాయతీ కార్యదర్శుల పరీక్ష

-ఫీజు చెల్లింపునకు నేడే చివరితేదీ.. -దరఖాస్తుల అప్‌లోడ్‌కు రేపు అవకాశం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈ నెల 28న రాతపరీక్ష నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలోని 30 జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీచేయాలని ప్రభు త్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనున్నది. ఫీజు చెల్లించిన అభ్యర్థులు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సోమవారంనాటికి 2,83,841 దరఖాస్తులు వచ్చాయి. 3,09,435 మంది ఫీజు చెల్లించారు.

శిక్షణకు 22లోగా మైనార్టీ సంక్షేమశాఖ దరఖాస్తుల ఆహ్వానం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మైనార్టీ సంక్షేమశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 040-23236113ను సంప్రదించాలని పేర్కొన్నది.