తెలంగాణ ఎన్నారైలకు ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలి: మహేశ్ బిగాల

తెలంగాణ ఎన్నారైలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల డిమాండ్ చేశారు. ఎన్నారైలను కించపరిచే విధంగా మంత్రి కేటీఆర్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించడంపై తెలంగాణ ఎన్నారై భగ్గుమంటున్నది. మంత్రి కేటీఆర్ అమెరికాలో గిన్నెలు కడిగేవారని అంటూ కించపరచడంపై ఉత్తమ్ క్షమాపణలు చెప్పాలని ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నారైలే కాదు..విదేశీయులు కూడా తమ ఇంట్లో పని తామే చేసుకుంటారని.. ఎన్నారైలు చాలా క్రమశిక్షణతో, బాధ్యతలో బతుకుతారని మహేశ్ అన్నారు. ఎన్నారైలు ఎక్కడున్నా తెలంగాణ బాగు కోసమే ఆలోచిస్తారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నారై సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడి, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసి.. తనకు తాను దిగజారిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నారైలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మహేశ్ బిగాల మండిపడ్డారు.

Related Stories: