ఎన్నారైపై దాడి.. గుండెపోటుతో మృతి

ఢిల్లీ: పిల్లల సెలవులను సరదాగా గడుపుదామని ఇండియాకు వచ్చిన ఎన్నారై ముష్కరుల దాడికి గురై గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్గావ్‌లోని సంపన్న డీఎల్‌ఎఫ్ ఫేజ్-2 టౌన్‌షిప్‌లో బుధవారం జరిగింది. 50 ఏండ్ల ఎన్నారై సోము బాలయ్యకు టెక్సాస్‌లో ఓ ఐటీ కంపెనీ ఉంది. సుమారు పాతికేండ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే ఆయన పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చారు. సంఘటన జరిగిన రోజు ఆయన తన టీనేజీ కుమారుని స్విమ్మింగ్‌కు తీసుకువెళదామని బయలుదేరారు. ఓ ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌సింగ్‌ను దారి అడిగారు. అతడు చెప్పిన ప్రకారం వెళ్తే చిరునామా కనుక్కోలేకపోయారు. తిరిగి వచ్చేటప్పుడు వాచ్‌మన్‌ను అలా ఎందుకు చెప్పావని బాలయ్య నిలదీశారు. ఇద్దరికీ వాగ్యుద్ధం జరిగింది. యజమాని మాణిక్ ఖోస్లా కూడా వచ్చిచేరారు. మాటామాటా పెరిగింది. కలబడ్డారు. యజమాని, వాచ్‌మన్ కలిసి బాలయ్యను చితకబాదారు. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. హుటాహుటిన ఆయనను దవాఖానకు తరలిస్తే అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించాడని వైద్యులు చెప్పారు. ఈ ఘటన యావత్తు సీసీటీవీలో నమోదైంది. ప్రాథమిక ఆధారాలతో పోలీసులు ప్రదీప్‌సింగ్‌ను, మాణిక్ ఖోస్లాను అరెస్టు చేశారు.

Related Stories: