ఫ్రెంచ్ పోరుకు సై..

french ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఆదివారం తెరలేవబోతున్నది. ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఫ్రెంచ్ టైటిల్ కోసం కదన రంగంలోకి దూకుతున్నారు. గత వారం జరిగిన ఇటాలియన్ ఓపెన్‌లో నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు. 2016లో ఇక్కడ ఫ్రెంచ్ టైటిల్‌ను దక్కించుకున్న ఈ సెర్బియా స్టార్..మరోమారు అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు. మరోవైపు తనకు కొట్టిన పిండిలాంటి మట్టికోర్టులో మళ్లీ టైటిల్‌ను ముద్దాడేందుకు నాదల్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమయ్యాడు. మహిళల విషయానికొస్తే..అమెరికా టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్ ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొనగా, జపాన్ సంచలనం నవోమి ఒసాకా ఫామ్‌లేమితో సతమతమవుతున్నది. తల్లి అయిన తర్వాత బరిలోకి దిగిన కొన్ని టోర్నీల్లో ఆకట్టుకున్న సెరెనా..ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి చెప్పుకోదగ్గ టోర్నీల్లో ఆడింది లేదు. కరోలినా ప్లిస్కోవా, డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్, కెర్బర్, క్విటోవా, స్టీఫెన్స్ లాంటి స్టార్లు పోటీ పడబోతున్నారు.