నోటాకు 1.33 కోట్ల ఓట్లు

న్యూఢిల్లీ : భారత ఎన్నికల ప్రక్రియలో నోటాతో విప్లవాత్మక మార్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013లో భారత ఎన్నికల సంఘం నోటాను అమల్లోకి తెచ్చింది. ఏ పార్టీ అభ్యర్థికి కూడా ఓటు వేయొద్దు అనుకునే ఓటర్లు.. తమ ఓటును నోటాకు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. తొలిసారిగా 2013లో జరిగిన ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటా అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. 2013 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును నోటాకు వేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నోటాను తొలిసారిగా అమలు చేశారు. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 60,02,942 కోట్లు వచ్చాయి. తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా(46,559 ఓట్లు) నోటాకు ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా(123 ఓట్లు) లక్షద్వీప్‌లో నోటాకు ఓట్లు నమోదు అయ్యాయి. రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో సరాసరి 2.70 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయి. గోవా, ఢిల్లీ(ఎన్సీటీ), ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు నోటాకు వేశారు. 2017లో పనాజీ, వాల్పాయి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 301(1.94 శాతం), 458(1.99 శాతం) ఓట్లు నోటాకు పోలయ్యాయి.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య