రాఫెల్, రామమందిరం లేకుండా బీజేపీ తీర్మానం

న్యూఢిల్లీ: రాఫెల్, రామమందిరం లేకుండానే బీజేపీ జాతీయ కార్యవర్గం తమ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. 2022లోపు నవ భారతాన్ని నిర్మిస్తామని ఈ తీర్మానం స్పష్టంచేసింది. ప్రతిపక్షాలకు నేత, నీతి, రాజనీతిలాంటివి ఏమీ లేవని, దేశంలో మోదీయే అత్యంత శక్తివంతమైన నేత అని కార్యవర్గం తీర్మానించింది. తమ రాజకీయ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వివరించారు. కాషాయాన్ని ఓడిస్తామనుకోవడం కాంగ్రెస్ పగటి కల అని ఆయన స్పష్టంచేశారు. గత నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 2022లోపు ఇండియా ఉగ్రవాదం, కుల, మతాలు లేని సమాజంగా ఎదుగుతుందని, ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండరని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

తీర్మానంలో రాఫెట్ డీల్ గురించి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించగా.. దాని అవసరం లేదని చెప్పారు. ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వాళ్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మధ్యవర్తులు ఎవరూ లేరు. ముఖ్యంగా ఖత్రోచి లేడు అని బోఫోర్స్ స్కాంను గుర్తుచేస్తూ కాంగ్రెస్‌కు కౌంటర్ వేశారు. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీకి అతి ముఖ్యమైన అంశమైన రామ మందిరాన్ని కూడా తీర్మానంలో చేర్చలేదని జవదేకర్ స్పష్టంచేశారు. ప్రతిపక్షాలకు ఓ వ్యూహం, ఎజెండా, విధానం ఏమీ లేవని కూడా ఈ తీర్మానంలో బీజేపీ తేల్చి చెప్పింది. మోదీని అడ్డుకోవడమే ప్రతిపక్షాల ఏకైక ఎజెండా అని జవదేకర్ అన్నారు. మోదీయే ప్రధాని కావాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య ఇప్పటికే 70 శాతానికిపైగా ఉందని ఆయన చెప్పారు.

Related Stories: