కర్ణాటక ఉత్పత్తికి ఎన్‌ఎండీసీ బ్రేక్

హైదరాబాద్, నవంబర్ 20: దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థయైన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ) కర్ణాటకలో నిర్వహిస్తున్న దొనిమలై గనిలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ గనిలో ఉత్పత్తైన ఖనిజంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం ప్రీమియం వసూలు చేయడాన్ని నిరసిస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఈ నెల 14న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కంపెనీ ఉన్నతాధికారులు కలుసుకొని ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినా, వెంటనే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంది.

కర్ణాటక క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ గనుల లీజ్‌ను రద్దుచేసుకుంటామని కంపెనీ హెచ్చరించింది. కంపెనీ అభ్యర్థనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఖచ్చితంగా 80 శాతం ప్రీమియం వసూలు చేయడానికి మొగ్గుచూపుతున్నదని విభిన్న వర్గాల ద్వారా తెలిసింది. దీంతో టన్నుకు రూ.1,348 మేర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.944 కోట్లు. ప్రస్తుతం ఈ గనిలో ఏడాదికి 70 లక్షల టన్నుల ఖనిజం ఉత్పత్తి అవుతున్నది. ఈ గనుల లీజు గడువును మరో 20 ఏండ్లపాటు పొడిగిస్తూ ఈ నెల 4న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.