వాతావరణ మార్పుతో నియాండర్తల్స్ అంతం

లండన్: ఆధునిక మానవులకు పూర్వీకులైన నియాండర్తల్స్ జాతి అంతం కావడంలో వాతావరణ మార్పులు ప్రధాన పాత్ర పోషించాయని బ్రిటన్‌కు చెందిన నార్తుంబ్రియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వారు రొమేనియాలోని గుహల్లో ఉన్న స్టాలగ్మైట్లను పరిశీలించి ఐరోపాలో గత 40 వేల ఏండ్లలో జరిగిన వాతావరణ మార్పులను అధ్యయనం చేశారు. గుహ పైభాగం నుంచి ఉపరితలంవైపు పెరిగే కోన్ వంటి నిర్మాణాలను స్టాలగ్మైట్లు అంటారు. ఇవి ఏటా కొంత మేర పెరుగుతూ ఒక పొరను ఏర్పరుస్తాయి. ఆ పొరను బట్టి వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చు. బ్రిటన్ శాస్త్రవేత్తలు రొమేనియన్ స్టాలగ్మైట్‌లను పరిశీలించినప్పుడు 44 వేల ఏండ్ల నుంచి 40 వేల ఏండ్ల మధ్య వాతావరణంలో తీవ్రమార్పులు జరిగినట్టు గుర్తించారు. కొన్ని శతాబ్దాలపాటు శీతల వాతావరణం ఉన్నదని, కొతకాలంపాటు మంచు కురిసిందని, ఆ వెంటనే ఉష్ణోగ్రతలు పెరిగి కొన్నేండ్లపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని గుర్తించారు. ఈ వాతావరణ మార్పులను తట్టుకోలేక నియాండర్తల్స్ జాతి క్రమంగా అంతమైందని పేర్కొన్నారు. వీరి పరిశోధన వ్యాసం పీఎన్‌ఏఎస్ జర్నల్‌లో ప్రచురితమైంది.

Related Stories: