అందరూ నియమాలు పాటిస్తే అందరికీ మంచిది: అక్షయ్ కుమార్

ఢిల్లీ: ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు 3లక్షల మంది గాయపడుతున్నారని చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రహదారి భద్రతా బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు. అంతకుముందు న్యూఢిల్లీలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహక కల్పించేందుకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. అన్ని రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులకు లేఖ రాశామని ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు. రహదారి భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరినట్లు చెప్పారు. రహదారి భద్రతపై మీడియా ప్రసారాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పక్కవారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమంలా సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం కోసం తనను ప్రచారకర్తగా నియమించినందుకు అక్షయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం ఇలాంటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారని అక్షయ్ పేర్కొన్నారు. ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూసి చలించిపోయాని తెలిపారు. ప్రాణాలు కోల్పోయినవారు, గాయపడినవారు ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. అందరూ నియమాలు పాటిస్తే అందరికీ మంచిదని సూచించారు. రోడ్డుపై సురక్షితంగా వెళ్లండి.. జీవితాన్ని రక్షించుకోండి అని అక్షయ్ పిలుపునిచ్చారు.
× RELATED కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం