భిన్న ఆవిష్కరణలతోనే ముందడుగు

-యువత మరింత పోటీ పడాలి:కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ -వరంగల్ నిట్‌లో భవనాలకు శంకుస్థాపన వరంగల్ నిట్‌క్యాంపస్/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృత్రిమ మేధస్సు, విభిన్న ఆవిష్కరణలతోనే దేశంలో సాంకేతిక ముందడుగు సాధ్యమతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ స్పష్టంచేశారు. వరంగల్ నిట్‌లో నూతనంగా నిర్మించిన మెటలర్జీ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, సెమినార్ హాల్స్ కాంప్లెక్స్, అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ భవనాలను ఆయన మంగళవారం ప్రారంభించా రు. అనంతరం మాట్లాడుతూ దేశంలో వరంగల్ నిట్ కు ఉన్నతస్థానం ఉన్నదన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణల సంస్కృతికి నాంది పలుకాలని, ఐడియాలతో దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకుపోవచ్చన్నారు. ప్రతిభావంతులు విదేశాల్లో కాకుండా ఇక్కడే పరిశోధనలు చేస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. నిట్ డైమండ్‌జూబ్లీ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ ప్రాజెక్ట్‌వర్క్స్ అధికారి ఎన్‌ఎన్‌ఎస్ రావు, ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్‌పీరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలంటే భయం వద్దు

పరీక్షలను పండుగలా భావించాలే తప్ప భయకంపితులు కావొద్దని ప్రధాని మోదీ తన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో ఉద్బోధించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరాం తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జవదేకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ బండా రు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.