ఫోక్స్‌వాగన్‌కు 100 కోట్ల జరిమానా!

న్యూఢిల్లీ: జర్మన్ కార్ల కంపెనీ ఫోక్స్‌వాగన్‌ను మధ్యంతరంగా రూ.100 కోట్లు సీపీసీబీ దగ్గర డిపాజిట్ చేయాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తమ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార పరీక్షల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో ట్రిబ్యునల్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ చేసిన ఈ పని వల్ల పర్యావరణానికి కలిగిన అసలు నష్టాన్ని అంచనా వేయడానికి పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో ఓ కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. వారం రోజుల్లో సంస్థ అభ్యంతరాలను దాఖలు చేయాలని ఫోక్స్‌వాగన్‌తోపాటు పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఉద్గారాల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఓ స్కూల్ టీచర్ సలోనీ ఐలావాడితోపాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి మోసపూరిత పరికరాలను వాడిన 3.23 లక్షల వాహనాలను రీకాల్ చేస్తామని గతంలో ఎన్‌జీటీకి కంపెనీ తెలిపింది. ఉద్గార పరీక్షల్లో తమ వాహనాలను గట్టెక్కించడానికి కంపెనీలు ఇలాంటి మోసపూరిత పరికరాలను వాడుతుంటాయి.

Related Stories: