మున్సిపోల్స్

- ఆరు మున్సిపాలిటీలు.. 142 వార్డుల్లో ఎన్నికలు.. - ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ - ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారయంత్రాంగం - సామగ్రితో కేంద్రాలకు చేరిన సిబ్బంది - ఓటు వేయాలంటే వ్యక్తిగత గుర్తింపు కార్డులు ఉండాలి.. - పంపిణీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ భారతి, సీపీ సత్యనారాయణ - అన్ని మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్ అమలు - కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9440900683 - సీసీ కెమెరాల నీడన పోలింగ్, కౌంటింగ్.. - ప్రతి పోలింగ్ కేంద్రానికి జియోట్యాగింగ్.. - డ్రోన్ కెమెరాలతో పరిశీలన మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 150 వార్డులు ఉన్నాయి. మంచిర్యాలలో 36, చెన్నూరులో 18 వార్డులు, క్యాతన్ 22 వార్డులు, బెల్లంపల్లిలో 34, నస్పూరులో 25, లక్షెట్టిపేటలో 15 వార్డులు ఉన్నాయి. ఇందులో చెన్నూరులో ఏడు ఏకగ్రీవం కాగా, బెల్లంపల్లిలో ఒక వార్డు ఏకగీవ్రమైంది. చెన్నూరు మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి కమ్మల శ్రీనివాస్, 5వ వార్డు నుంచి నజీమబేగం, 10 వార్డు నుంచి అర్చన గిల్డా, 11వ వార్డు నుంచి పెండ్యాల స్వర్ణలత, 13 వార్డు నుంచి నవాజొద్దీన్, 14వ వార్డు నుంచి మేడ స్రవంతి, 18వ వార్డు నుంచి గర్రెపల్లి కాంతారాణి ఏకగ్రీవం అయ్యారు. ఇక బెల్లంపల్లిలో 17వ వార్డు నుంచి బత్తుల సుదర్శన్ ఎన్నికయ్యారు. చెన్నూరులో 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి తనుగుల సరోజన టీఆర్ చేరారు. దీంతో అక్కడ కూడా పోటీ లేకుండా పోయింది. ఇది వార్డు కూడా టీఆర్ ఖాతాలో చేరింది. దీంతో ఏకగ్రీవం అయిన ఎనిమిది వార్డులు మినహా మిగతా 142 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 601 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అన్నీ రికార్డే.. మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రతి విషయాన్ని రికార్డు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రారంభం మొదలు.. ఓట్ల లెక్కింపు అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతకవకలు జరగకుండా ఓట్ల లెక్కింపు సైతం పారదర్శకంగా జరిగేలా సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ మేరకు పోలీసు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలింగ్ కేంద్రాలు అన్నింటిని జియోట్యాగింగ్ చేశారు. 800 సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, డ్రోన్ కెమెరాలు సైతం ఉపయోగించనున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల చుట్టూ బయట వంద మీటర్ల పరిధిలో జరిగే ప్రతి విషయాన్ని రికార్డు చేసేందుకు వీలుగా అధునాతమైన సీసీ కెమెరాలు ఉపయోగించేందుకు కసరత్తు పూర్తి చేశారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలన్ని నిఘా నీడలో ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,49,175 మంది జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో ఓటర్లు 2,49,175 మంది ఉన్నారు. ఆరు మున్సిపాటిల్లో పురుషులు 1,25,431 మంది ఉండగా, స్త్రీలు 1,23,720 మంది ఉన్నారు. ఇతరులు 24 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 నుంచి 2,500 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 385 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 120 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 41 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక, సున్నితమైన 41 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. పోలింగ్ శాతం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టినా ప్రతిసారి మున్సిపల్ ఎన్నికల్లో 60 నుంచి 70 శాతానికి మించడం లేదు. ఈసారి ఎలాగైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అంతటా ఓటు ప్రాధాన్యత తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ భారతి వెల్లడించారు.
More